న్యూఢిల్లీ: జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు శిబు సోరెన్ మరణించారని ఆయన కుమారుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తెలిపారు. ఈ మేరకు Xలో పోస్ట్ చేసారు. “గౌరవనీయులైన గురూజీ మనందరినీ విడిచిపెట్టి వెళ్లిపోయారు… నేను ఈరోజు జీరోగా మిగిలాను అంటూ హేమంత్ సోరెన్ Xలో పోస్ట్ చేశారు.
కాగా, శిబు సోరెన్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. గత నెల 24న గంగారం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. సర్ గంగా రామ్ ఆసుపత్రి నెఫ్రాలజీ విభాగం చైర్మన్ డాక్టర్ ఎ కె భల్లా ప్రకారం… శిబు సోరెన్ ఉదయం 8.56 గంటలకు మరణించినట్లు ప్రకటించారు.
శిబు సోరెన్ గత 38 సంవత్సరాలుగా జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడిగా ఉన్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా గుర్తింపు పొందారు. జార్ఖండ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించగా.. ఆయన మృతి పట్ల రాష్ట్ర ప్రజలంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన వర్గాలకు, పేదలకు, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడం కోసం శిబు సోరెన్ ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. దేశ రాజకీయాల్లో కూడా ఆయన తనదైన ముద్ర వేసుకున్నారని చెప్పారు. రాష్ట్రపతి ముర్ముతో సహా పలువురు నాయకులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.
8 సార్లు లోక్‌సభ ఎంపీగా, రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా, జార్ఞండ్ సీఎంగా ఎనలేని సేవలు అందించారని నేతలు గుర్తు చేసుకున్నారు. శిబు సోరెన్ మరణం జార్ఖండ్ రాజకీయాల్లో తీరని లోటు.