న్యూఢిల్లీ: ప్రముఖ కలం యోధుడు, గ్రంధకర్త, హిందీ, ఉర్దూ సాహిత్యకారుడు మున్షీ ప్రేమ్‌చంద్ ఇస్లాం ధర్మంలోని సమానత్వ సందేశాన్ని ప్రశంసించారు. ఉన్నత, నిమ్న వర్గాల మధ్య వివక్షతను తొలగిస్తుందని ఆయన అప్పట్లోనే పేర్కొన్నారు. ఇస్లాంలోని అన్ని తెగల ముస్లింలు ఒకే వరుసలో కలిసి ప్రార్థన చేస్తారు. ఒకే టేబుల్ వద్ద భోజనం చేయవచ్చు. ఇస్లాంను స్వీకరించిన తర్వాత, ఒక వ్యక్తి మలినాలు, వ్యత్యాసాలు తొలగిపోతాయని, వారు ఇమామ్ వెనుక ప్రార్థన చేయడానికి అర్హులవుతారు. అంతేకాదు ఇస్లాంలో అత్యంత గౌరవనీయమైన తెగలలో ఒకటైన సయ్యద్‌లతో కలిసి భోజనం చేయడానికి వీలు కల్పిస్తుందని ఆయన హైలైట్ చేశారు.
అతని కాలంలో, మత రాజకీయ నాయకులు తమ సొంత లాభం కోసం ఇస్లాంను హింసతో ముడిపెట్టారు, కానీ ప్రేమ్‌చంద్ అవగాహన పూర్తిగా భిన్నంగా ఉంది. ఇస్లాం వ్యాప్తి గురించిన అపోహలను ఆయన తోసిపుచ్చారు, ఇస్లాం సహా ఏ మతాన్ని బలవంతంగా రుద్దలేమని ఆయన పేర్కొన్నారు.
1931 నవంబర్‌లో రాసిన వ్యాసంలో… ఏ మతం కత్తి ద్వారా వ్యాపించదని, అది తాత్కాలికంగా వ్యాపించినప్పటికీ, అలా ఎక్కువ కాలం కొనసాగదని ఆయన రాశారు. భారతదేశంలో ఇస్లాం వ్యాప్తికి అణచివేత కుల-ఆధారిత సామాజిక వ్యవస్థ కారణమని ప్రేమ్‌చంద్ అన్నారు. ఇక్కడ దిగువ కులాల వ్యక్తులు దోపిడీని ఎదుర్కొన్నారు. సామాజిక విముక్తి కోసం ఇస్లాంను స్వీకరించారు.
ప్రేమ్‌చంద్ దృష్టిలో… ఇస్లాం ఈ దేశానికి శత్రువు కాదు. కానీ అణగారిన వర్గాలకు రక్షణ ఇస్తుంది. భారతదేశంలో ఇస్లాం దాని సమానత్వ సూత్రాల కారణంగానే ఎక్కువమంది స్వీకరించారని, ఇస్లాంలో మానవులందరికీ సమాన హక్కులు ఉన్నాయని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. ఇస్లాం బలవంతంగా కాకుండా దాని సూత్రాల గొప్పతనం ద్వారా వ్యాపించిందని ఆయన వాదించారు.
హిందువులు, ముస్లింలు ప్రత్యేక దేశాలుగా విభజితమైన యుగంలో… ప్రేమ్‌చంద్ వారి ఉమ్మడి సంస్కృతిని నొక్కిచెప్పారు, హిందూ, ముస్లిం నాగరికతల మధ్య ఎటువంటి ప్రాథమిక తేడాను తాను చూడలేదని పేర్కొన్నారు. ఉదాహరణకు ముస్లింలు పైజామా ధరిస్తే.., పంజాబ్-సరిహద్దు ప్రాంతాలలో హిందువులు కూడా అలాంటి మోడల్ దుస్తులనే ధరించారు. తన వాదనలకు సాక్ష్యంగా ప్రేమ్‌చంద్ చారిత్రక పరిశోధనలను కూడా ఉపయోగించుకున్నాడు, మధ్యయుగ యుద్ధాలు హిందూ- ముస్లిం వర్గాల మధ్య కాదని వాదించడానికి చరిత్రకారుడు కె.ఎం. హబీబ్‌ను ఉటంకించాడు.
ఆఫ్ఘన్లు రాయ్ పిథోరా కోసం పోరాడారని, మరాఠాలు పానిపట్ యుద్ధంలో ముస్లింలకు మద్దతు ఇచ్చారని చూపించే ఆధారాలను ఆయన ప్రస్తావించారు. 1857 స్వాతంత్ర్య యుద్ధంలో, బహదూర్ షా జాఫర్ నాయకుడిగా హిందువులు, ముస్లింలు ఐక్యమయ్యారని, దానిని మర్చిపోకూడదని ఆయన నొక్కి చెప్పారు.
ప్రేమ్‌చంద్ తన రచనల ద్వారా ఉర్దూ ఒక నిర్దిష్ట మతానికి చెందినదనే భావనను కూడా తిరస్కరించారు, హిందూ, ముస్లిం రచయితలు ఇద్దరూ దాని అభివృద్ధికి చేసిన కృషిని హైలైట్ చేశారు. గోవధ పేరుతో ముస్లిం వ్యతిరేక రాజకీయాలను ఆయన ఖండించారు, గోవులను పూజించే హక్కు ఉన్నప్పటికీ, ఇతరులను అలా చేయమని బలవంతం చేసే హక్కు ఎవరికీ లేదని పేర్కొన్నారు.
మత రచయితలు,నాయకులు తరచుగా సామాజిక, ఆర్థిక చరిత్రను విస్మరిస్తూ రాజకీయ చరిత్రను అతిగా నొక్కి చెబుతారు. ఇక్కడే ప్రేమ్‌చంద్ ప్రత్యేకంగా నిలుస్తాడు. ఆయన సమాజాన్ని రాజకీయ లేదా మతపరమైన దృష్టికోణం ద్వారా కాకుండా చారిత్రక, సామాజిక, ఆర్థిక దృక్పథం నుండి చూశారు. హిందీ సాహిత్యంలో ప్రగతిశీల ఆలోచనకు పునాది వేశారు.
కాగా, ఈ ఏడాది మున్షీ ప్రేమ్‌చంద్ 145వ జయంతిని సాహిత్యకారులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆయన అసలు పేరు ధన్‌పత్ రాయ్ శ్రీవాస్తవ. జూలై 31, 1880న ప్రస్తుత వారణాసి జిల్లాలోని లాంహి గ్రామంలో ఆయన జన్మించారు. ప్రేమ్‌చంద్ సాహిత్య రంగంలోకి అడుగుపెట్టినప్పుడు, అతను మానవ బాధలు, పేదరికం, అన్యాయం, సామాజిక వాస్తవాలను తన రచనలకు అంశాలుగా చేసుకున్నాడు. కలం పేరు ప్రేమ్‌చంద్‌గా ప్రఖ్యాతి చెందారు.
వలసవాద భారతదేశంలోని లోబరుచుకొనే శక్తులపై 1930 ప్రాంతంలో ఆయన కథానికలు తీవ్రంగా దాడి చేస్తే, ఆయన రాసిన ‘గోదాన్’, ‘గబన్’, ‘నిర్మల’ వంటి నవలలు కుండ బద్దలు కొట్టినట్లు ఉంటాయి. సమాజంలోని అన్యాయాలపై ఆయన సూటిగా, నిర్మొహమాటంగా తన రచనల్లో విరుచుకుపడ్డారు. ఆయన రచనల్లో కొన్ని.. ఘాటైన విమర్శలకు గురైనప్పటికీ ఆయనను అనుకరించే రచయితలు పలువురు ఇప్పటికీ ఉండటం విశేషం.