న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ ప్రతిపక్షనేత రాహుల్ ఆధారాలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం స్పందించింది. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమీషనర్ మాట్లాడుతూ… రాహుల్ గాంధీ తాను చేసిన ఆరోపణపై రుజువులను చూపిస్తూ వారం లోగా అఫిడవిట్ సమర్పించాలని, లేకపోతే ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరింది. ఒకవేళ ఆరోపణలకు రుజువులు లేకపోతే అవన్నీ అబద్ధాలని పేర్కొంది.
అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో లక్షకు పైగా ఓట్లు చోరీ అయ్యాయనే ఆరోపణలపై ఎన్నికల సంఘం (EC) మాత్రం ఎటువంటి సమాధానాలు ఇవ్వలేదు. అదే సమయంలో రాయ్ బరేలి, వయనాడ్, డైమండ్ హార్బర్, కన్నౌజ్‌లలో ఓటర్ల జాబితాలలో అక్రమాలు జరిగాయని, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, అభిషేక్ బెనర్జీ, అఖిలేష్ యాదవ్‌లను లోక్‌సభ ఎంపీలుగా రాజీనామా చేయాలని ఆరోపించిన బీజేపీ ఎంపి అనురాగ్ ఠాకూర్‌ను వదిలేసింది.
కాగా, ఓట్ల చోరీపై రాహుల్ ఆందోళన కార్యక్రమం మొదలు పెట్టిన నేపథ్యంలో జ్ఞానేశ్ ఆదివారం ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్సింగ్ సంధు, వివేక్ జోషీతో కలిసి 85 నిమిషాల సేపు మీడియాతో మాట్లాడారు.
దొంగ, నకిలీ ఓట్లను చేర్చి వాటి చిరునామాలో ఇంటి నంబర్‌ను సున్నాగా పేర్కొన్నట్టు రాహుల్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని దాటవేశారు. ఇల్లు లేని, వంతెనలు, ఫుట్‌పాత్‌లు, వీధి దీపాలు, అనధికార కాలనీల్లో నివసించే వారికి నిర్దిష్టమైన చిరునామా, నంబర్ ఉండవు. అందుకే ఆ కాలమ్‌ను ఖాళీగా వదిలేయకుండా ఇంటి నంబర్‌ను ‘సున్నా’గా పేర్కొంటాం. ఓటేసేందుకు చిరునామా ముఖ్యంకాదు. ఓటరు ఏ బూత్‌లో ఓటేస్తాడనేదే ముఖ్యం” అన్నారు.