కైరో: ఇజ్రాయెల్ ప్రతిపాదిత గాజా పునరావాస ప్రణాళిక ఈ ప్రాంతంలోని లక్షలాది మంది నిరాశ్రయులను చేస్తుందని హమాస్ పేర్కొంది. దక్షిణ గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ టెంట్లు, ఇతర గృహ పరికరాలను మోహరించడం “స్పష్టమైన మోసం” అని ఆ బృందం పేర్కొంది.
గాజాలో పరిస్థితులపై యుఎన్ హెచ్చరిక
ఇజ్రాయిల్ నెలల తరబడి గాజాలో సాగిస్తున్న సుదీర్ఘ యుద్ధం, ఆంక్షలు కారణంగా దాదాపు 10లక్షల మంది మహిళలు, బాలికలు మూకుమ్మడి కరువు పరిస్థితులను, హింసను, హక్కుల ఉల్లంఘనలను ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్య సమితి పాలస్తీనా శరణార్ధుల సంస్థ (యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ) శనివారం హెచ్చరించింది. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టింది. ఇజ్రాయిల్ ఆర్మీ అత్యంత ప్రమాదకరమైన వ్యూహాలను అనుసరిస్తోంది. ఆహారం, నీరు కోసం బయటకు వెళ్ళడమంటే తిరిగి ఇంటికి వస్తామో రామోననే భయం అందరిలోనూ నెలకొందని ఆ పోస్టు పేర్కొంది. గాజా సరిహద్దుల వద్ద వేలాది ట్రక్కులు నిలిచిపోయినా ఇజ్రాయిల్ అన్ని దారులను మూసివేసి, అరకొరగా మానవతా సాయాన్ని లోపలకు అనుమతిస్తోంది. ఫలితంగా గాజాలోని 24లక్షల మంది ప్రజల్లో మూడో వంతు మంది ప్రజలు అనేక రోజుల పాటు ఆహారం లేకుండా కాలం గడుపుతున్నారని ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యుఎఫ్‌పి) హెచ్చరించింది.
2023 అక్టోబరులో దాడులు మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు గాజాలో 61,900మందిని ఇజ్రాయిల్ పొట్టనబెట్టుకుంది. ఆహారం కోసం వెళ్ళి అశువులు బాసిన వారి సంఖ్య మే నుండి ఆగస్టు 13 నాటికి 1760కి చేరిందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం వెల్లడించింది. ఇదిలా వుండగా, గాజాలో కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చల కోసం పాలస్తీనా ప్రధాని మహ్మద్ ముస్తఫా ఆదివారం ఈజిప్ట్‌లో పర్యటించనున్నారు.