న్యూఢిల్లీ: హైదరాబాద్ నుండి గతంలో ప్రచురితమయ్యే ఆంగ్ల దినపత్రిక ఫ్రీడమ్ ప్రెస్… తన ఢిల్లీ ఎడిషన్‌ను ప్రారంభించింది. తద్వారా దేశ డైనమిక్ మీడియా ప్రపంచంలోకి ప్రవేశించింది. మీడియాలో నీతి, స్వాతంత్ర్యం తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న సమయంలో…ఫ్రీడమ్ ప్రెస్ వార్తాపత్రిక స్వేచ్ఛ, వాక్ స్వాత్యంత్య్రం, పారదర్శకత, జర్నలిజం విలువలను నిలబెడతామని ప్రతిజ్ఞ చేసింది.
న్యూఢిల్లీలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో దౌత్యవేత్తలు, పార్లమెంటేరియన్లు, విద్యావేత్తలు, పౌర సమాజ నాయకులు పాల్గొన్నారు. ఈ వేడుక అహ్లాదకర వాతావరణంలో ఘనంగా జరిగింది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, భారతదేశ ఏకత్వాన్ని కాపాడడంలో స్వతంత్ర పత్రిక కీలక పాత్రను పోషించాలని వక్తలు నొక్కి చెప్పారు. డజనుకు పైగా పార్లమెంటేరియన్లు, దౌత్యవేత్తలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ మేరకు ఫ్రీడమ్ ప్రెస్ చీఫ్ ఎడిటర్ అబ్దుల్లా ఖాన్ మాట్లాడుతూ… “నిర్భయ, వాస్తవిక, న్యాయమైన జర్నలిజం” పట్ల తమ నిబద్ధత కొనసాగుతుందని చెప్పారు. మా వార్తాపత్రిక రాజకీయాలు, పాలనపై మాత్రమే కాకుండా యువత సమస్యలు, ఆవిష్కరణ, విద్య, ప్రధాన స్రవంతి కథనాలలో తరచుగా విస్మరణకు గురయ్యే అణగారిన స్వరాలపై కూడా దృష్టి సారిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా హాజరైన అనేక మంది విదేశీ దౌత్యవేత్తలు ఈ చొరవను ప్రశంసించారు. యూరోపియన్ యూనియన్ నుండి ఒక సీనియర్ రాయబారి మాట్లాడుతూ…పత్రికలు”స్వేచ్ఛాయుత, అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలని” అన్నారు. భారతదేశంలో విభిన్న మీడియా స్వరాల సంప్రదాయాన్ని ప్రశంసించారు. దక్షిణాసియా నుండి హజరైన ఒక రాయబారి మాట్లాడుతూ… ఆంగ్లంలో కొత్త ప్రచురణను ప్రారంభించడం సరిహద్దులు, సమాజాల మధ్య చర్చను ప్రోత్సహించడంలో సహాయపడుతుందని జోడించారు.
పార్టీలకు అతీతంగా పార్లమెంటేరియన్లు కూడా తమ దృక్పథాలను పంచుకున్నారు. చాలా మంది పార్లమెంటు సభ్యులు “సంస్థలను జవాబుదారీగా ఉంచడం ద్వారా సమగ్రత కలిగిన వార్తాపత్రిక పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయగలదు” అని హైలైట్ చేశారు. తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడానికి ఫ్రీడమ్ ప్రెస్‌ను సకాలంలో జోక్యం చేసుకోవాలని అన్నార. అంతేకాదు రాజ్యాంగ విలువలను నిలబెట్టాల్సిన అవసరాన్ని మరొక ఎంపీ నొక్కి చెప్పారు.
మిస్టర్ అన్జరుల్ బారి రెసిడెంట్ ఎడిటర్‌గా ఉన్న న్యూఢిల్లీ ఎడిషన్ జాతీయ, అంతర్జాతీయ దృక్పథాలను అందిస్తూ ప్రాంతీయ పరిణామాలను లోతుగా కవర్ చేస్తుందని భావిస్తున్నారు. రెండు ప్రధాన కేంద్రాల నుండి పనిచేయడం ద్వారా, ఈ ప్రచురణ ఉత్తర-దక్షిణ మీడియాల మధ్య వారధిగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది.
ఈ వార్తాపత్రిక పక్షపాత అజెండాలకు అతీతంగా ఎదగాలని వేడుకలో అతిథులు ఆశాభావం వ్యక్తం చేశారు. సంచలనాత్మకతకు విరుద్ధంగా పాఠకులు “నెమ్మదిగా, ఆలోచనాత్మకంగా జర్నలిజం”ని ఎక్కువగా కోరుతున్నారని, ఆ ఆదర్శాలను పాటించాలని ఫ్రీడమ్ ప్రెస్‌ను కోరారు.