సనా: ఇరాన్ మద్దతుగల తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్‌పై క్లస్టర్ బాంబులను ప్రయోగించిన కొద్ది రోజులకే, నిన్న తెల్లవారుజామున యెమెన్ రాజధాని సనాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడిందని స్థానిక మీడియా నివేదిక తెలిపింది.
హౌతీల నేతృత్వంలోని అల్-మసిరా ఛానల్ ఈ దాడులను దృవీకరించింది. గత కొంతకాలంగా రెడ్ సీలో, అడెన్ గల్ఫ్‌లో వాణిజ్య నౌకలపై హౌతీలు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరుపడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వాస్తవానికి హౌతీ దాడులు ఇజ్రాయెల్‌కు, నౌకల భద్రతకు తీవ్ర ముప్పుగా మారింది. యెమెన్ రాజధాని సనాలోని కీలక ప్రాంతాల్లో, అలాగే హౌతీల ఆధీనంలో ఉన్న ప్రాంతాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లుగా యెమెన్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. పేలుడు శబ్దాలు, పొగ దట్టంగా వ్యాపించింది. అయితే, హౌతీ తిరుగుబాటుదారులు ఇప్పటివరకు దాడులతో జరిగిన ఆస్తి నష్టం, ప్రాణనష్టంపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. కాగా, ఆదివారం జరిగిన దాడిని ఇజ్రాయెల్ ధృవీకరించలేదు.
ఇరాన్ మద్దతుగల హౌతీలు 22 నెలలకు పైగా ఇజ్రాయెల్ వైపు క్షిపణులు, డ్రోన్‌లను ప్రయోగించారు. ఎర్ర సముద్రంలో ఓడలను లక్ష్యంగా చేసుకున్నారు. గాజా స్ట్రిప్‌లో యుద్ధం మధ్య పాలస్తీనియన్లకు సంఘీభావంగా తాము ఈ దాడులను నిర్వహిస్తున్నామని వారు చెబుతున్నారు.
సైనిక నిబంధనలకు అనుగుణంగా పేరు చెప్పకూడదనే షరతుపై మాట్లాడిన ఇజ్రాయెల్ వైమానిక దళ అధికారి, శుక్రవారం రాత్రి యెమెన్ నుండి ఇజ్రాయెల్ వైపు ప్రయోగించిన మిస్సైల్ కొత్త ముప్పును సూచిస్తుందని అన్నారు. ఆ క్షిపణి ఒక క్లస్టర్ బాంబులు మోసుకెళ్లడం గమనార్హం.
2023లో ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్ వైపు రాకెట్లను ప్రయోగించడం ప్రారంభించిన తర్వాత ఇరాన్ ప్రాయోజిత హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్‌పై క్లస్టర్ బాంబును ప్రయోగించడం ఇదే మొదటిసారి అని అధికారి తెలిపారు. క్లస్టర్ బాంబుల వాడకం ఇజ్రాయెల్‌కు అడ్డగించడం కష్టతరం చేస్తుంది. హౌతీలకు ఇరాన్ అందించిన అదనపు సాంకేతికతను కూడా సూచిస్తుందని అధికారి తెలిపారు.