హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 30న ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నోటిఫికేషన్ జారీ చేశారు. అంతకు ముందు రోజు ఆగస్టు 29న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ క్యాబినెట్ సమావేశానికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశమే ముఖ్యమైన ఎజెండాగా ఉండనుంది.
కాగా, అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు కొనసాగుతాయని భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం కమీషన్ నివేదికపై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన 650 పేజీల నివేదిక సమగ్ర ప్రతిని అసెంబ్లీ, మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశముంది. అందుకు అనుగుణంగా ఈ సమావేశాల్లోనే సభ్యులందరికీ కమిషన్ రిపోర్ట్‌ను ప్రభుత్వం అందించనుంది.
ఇదిలా ఉండగా కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశమిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతకుముందే ప్రకటించారు. ఇటీవల హైకోర్టుకు కూడా ప్రభుత్వం ఇదే విషయాన్ని నివేదించింది. అసెంబ్లీలో చర్చించిన తర్వాత తదుపరి ఏం చేయాలో నిర్ణయిస్తామని తెలిపింది.
కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యమే కారణమని కమిషన్ నివేదికలో ప్రస్తావించడం, మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్లను తప్పుపట్టిన నేపథ్యంలో.. అసెంబ్లీలో దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది.