న్యూఢిల్లీ: పాలస్తీనాలో ఇజ్రాయెల్ పాశవిక దాడులకు గాజా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. వీరిలో మహిళలు, పిల్లలే కాదు ఏకంగా ఇంకా జీవం పోసుకోని పిండాలు కూడా ఉండటమే నేటి విషాదం. ఇక్కడి అల్-బాస్మా IVF కేంద్రంపై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసినప్పుడు 4,000 కంటే ఎక్కువ ఘనీభవించిన పిండాలు, 1,000 స్పెర్మ్ నమూనాలు, ఇంకా ఫలదీకరణం చెందని అండాలనుయనాశనం చేసిందని పాలస్తీనియన్ మానవ హక్కుల కేంద్రం (PCHR) విడుదల చేసిన నివేదిక తెలిపింది.
“ఇజ్రాయెల్ సైనిక దురాక్రమణ జరిగిన మొదటి ఏడు వారాల్లోనే” మొదటి దశ విధ్వంసం జరిగిందని, రెండవ దశ డిసెంబర్ 2023లో జరిగిందని నివేదిక పేర్కొంది – దీని ఫలితంగా ఐవీఎఫ్ సెంటర్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఐక్యరాజ్యసమితి (UN) విచారణ కమిషన్ మార్చి 2025లో ప్రచురించిన నివేదికలో ఈ సంఘటనను నమోదు చేసింది.

‘వాయిసెస్ ఆఫ్ ది జెనోసైడ్’ అనే శీర్షికతో ఉన్న ఈ నివేదిక, అక్టోబర్ 2023 నుండి జనవరి 2025 వరకు “గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న జెనోసైడ్”ను నమోదు చేస్తుంది. ఇది గాజా నుండి పాలస్తీనియన్లతో PCHR నిర్వహించిన 1,225 ఇంటర్వ్యూల ఆధారంగా రూపొందింది. ఓపెన్ సోర్స్ సమాచారం, గాజాలోని స్థానిక సంస్థలు, UN వంటి అంతర్జాతీయ సంస్థలు, పరిస్థితిని పర్యవేక్షిస్తున్న మానవ హక్కుల సంస్థల నుండి అధికారిక నివేదికలు దీనిని దృవీకరించాయి.
నివేదిక ప్రకారం, గాజాలోని హాలా ఫెర్టిలిటీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ మొహమ్మద్ జోడా PCHRతో మాట్లాడుతూ… ఈ కేంద్రం “ట్యాంక్ షెల్స్‌తో బాంబు దాడి చేసారని, అన్ని పరికరాలను పూర్తిగా నాశనం చేసి భవనానికి విస్తృతమైన నష్టాన్ని కలిగించిందని” అన్నారు.
“యుద్ధ సమయంలో, ఐదుగురు మహిళలకు ఐవీఎఫ్ చేయాల్సి వుంది. అయితే ఇజ్రాయెల్ దాడి కారణంగా మేము చేయలేకపోయాము. అందువల్ల, ఇంప్లాంటేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు. విషాదకరమైన విషయం ఏంటంటే ఇద్దరు మహిళలకు, ఇంప్లాంటేషన్ చివరి ప్రయత్నం. ఎందుకంటే వారికి తదుపరి ఇంప్లాంటేషన్ అవకాశం లేదు. యుద్ధానికి ముందు పనిచేస్తున్న ఎనిమిది కేంద్రాలలో, ఆరు కేంద్రాలు ఇజ్రాయెల్ పూర్తిగా ధ్వంసం చేసింది. ప్రస్తుత పరిస్థితులలో, ఇంప్లాంటేషన్ ఆపరేషన్లు చేసే అవకాశం లేదు. దిగ్బంధనం కారణంగా ప్రత్యేక పరికరాలు అందుబాటులో లేకుండా పోయాయి.
“ఉద్దేశపూర్వకంగా సంతానోత్పత్తి కేంద్రాలను నాశనం చేయడం”, 4,000 కంటే ఎక్కువ ఘనీభవించిన పిండాలను కోల్పోవడం సహా, పాలస్తీనా జనాభా పునరుత్పత్తి సామర్థ్యంపై ప్రత్యక్ష దాడిని సూచిస్తుందని, జననాలను నిరోధించాలనే ఉద్దేశ్యాన్ని ఇది తెలుపుతుందని నివేదిక పేర్కొంది.
ఇంకా, నవంబర్ 2023లో, మహిళలు, బాలికలపై హింసపై UN ప్రత్యేక నివేదకుడు పాలస్తీనా మహిళలు, శిశువులు, పిల్లలపై ఇజ్రాయెల్ చంపేసిందని ఆయన హైలైట్ చేశారు, ఈ చర్యలు జెనోసైడ్ కన్వెన్షన్ కింద మారణహోమంగా పరిగణిస్తారని పేర్కొన్నారు.
జెనోసైడ్ కన్వెన్షన్ ఆర్టికల్ II(d) ప్రకారం… “రక్షిత సమూహంలో జననాలను నిరోధించడం, తద్వారా సమూహంలో జీవసంబంధమైన ఉనికిని లక్ష్యంగా చేసుకోవడాన్ని సూచిస్తుంది.
మొత్తంగా “20 నెలల మారణహోమ యుద్ధం తర్వాత గాజాలో ప్రస్తుత దృశ్యం ఆధునిక చరిత్రలో కనిపించని విధంగా ఊహించలేని వినాశనం జరిగింది. UN అంచనాల ప్రకారం, జూలై 2024 మధ్య నాటికి, బాంబు దాడి నుండి శిథిలాలు 42 మిలియన్ టన్నులను అధిగమించాయి. “ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న నగరమైన రఫా, మే 2024లో జరిగిన పూర్తి స్థాయి దాడి తరువాత పూర్తిగా నాశనమైంది. ఖాన్ యూనిస్, దాని తూర్పు పట్టణాలలో ఎక్కువ భాగం నేలమట్టమయ్యాయి. ఫలితంగా అక్కడి స్థానికులు ఇప్పటికే రద్దీగా ఉన్న అల్-మవాసి ప్రాంతానికి పారిపోవలసి వచ్చింది” అని నివేదిక పేర్కొంది.
అంతేకాదు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను క్రమపద్ధతిలో కూల్చివేసారు. ఇందులో ఆసుపత్రులపై బాంబు దాడులు, వైద్య సిబ్బందిని చంపడం, ఇంక్యుబేటర్లలో శిశువులతో సహా రోగులు – “చనిపోవడం కూడా నివేదికలో నమోదు చేసారు. అలాగే “లైంగిక హింస, కస్టడీలో మరణాలు” సహా వేలాది మంది పౌరుల సామూహిక అరెస్టులు, హింస కూడా నివేదికలో పొందుపరిచారు.