హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై కె. కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. కవిత తండ్రి, బిఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు ఆమెను తక్షణమే సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి టి. రవీందర్ రావు, మరో ప్రధాన కార్యదర్శి (క్రమశిక్షణా వ్యవహారాల ఇన్‌ఛార్జ్) సోమ భరత్ కుమార్ మీడియాకు తెలిపారు.
కాగా, ఇటీవలి కాలంలో కవిత ప్రవర్తన, ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బిఆర్ఎస్‌ను బాధిస్తున్నాయి. నాయకత్వం దీనిని తీవ్రంగా పరిగణించిందని వారు ఓ ప్రకటనలో తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిలో మాజీ మంత్రి హరీష్ రావు, రాజ్యసభ మాజీ ఎంపీ సంతోష్ రావుల హస్తం ఉందంటూ కల్వకుంట్ల కవిత.. సోమవారం చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉన్నాయని భావించిన కేసీఆర్ కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
గతంలోనూ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంట దెయ్యాలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై కవిత చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. కాగా, తాజాపరిణామాలపై ఎమ్మెల్సీ కవిత సన్నిహితులతో సమాలోచనలు చేస్తున్నారు. పార్టీ పదవితో పాటు ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తారని అంటున్నారు.