మీకు తెలిసిన ముస్లింలలో ఎంతమంది పేరు మహమ్మద్ అని ఉంది? లేదా కనీసం వారి రెండు పేర్లలో ఒకటైనా ముహమ్మద్ అని ఉందేమో! చాలా మందికి ఈ పేరు ఉండే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లకు పైగా ప్రజలు మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ప్రేమిస్తారు, ఆయన్ను అనుసరిస్తారు. తమ పిల్లలకు పేరు పెట్టడానికి ముస్లింలు అత్యంత ఎక్కువగా ఎంచుకునే పేరు బహుశా ఇదే.
ముస్లింలకు ఆయన పేరు ఎంత ప్రియమైనదో అనే దానిపై ఎలాంటి సందేహం లేదు. యూకే జనాభాలో ముస్లింలు 5% కన్నా తక్కువ ఉన్నప్పటికీ, ‘ముహమ్మద్’ అనేది ఆ దేశంలో 15వ అత్యంత ప్రజాదరణ పొందిన పేరు. చాలా సంస్కృతులలో, ముస్లింలకు రెండు పేర్లు ఉంటాయి: ఒకటి ముహమ్మద్, మరొకటి ఆ వ్యక్తికి పెట్టిన పేరు. ప్రపంచంలో ఆయనకు ఉన్న ప్రేమ, గౌరవాన్ని చూసి మాషా అల్లాహ్ అనాలనిపిస్తుంది.
తమ దైవ సందేశం ప్రారంభ రోజుల్లో ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎంతగా అపనిందలు ఎదుర్కొన్నారో నాకు గుర్తొస్తుంది. కేవలం ఒక్క దేవుడిని మాత్రమే ఆరాధించమని, విగ్రహారాధనను మానేయమని ప్రజలను ఆహ్వానించడమే ఆయన సందేశం. ఆ సమయంలో ప్రవక్త గారికి ఉన్న ఏకైక కుమారుడు ఖాసిమ్ చిన్న వయసులోనే మరణించారు. [నిజానికి, ఆయన ఇద్దరు కుమారులు చనిపోయారు] ప్రవక్త సందేశాన్ని వ్యతిరేకించే ఆయిన ఆయన బాబాయి అబూ లహబ్, మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారసత్వాన్ని కొనసాగించడానికి ఎవరూ ఉండరని, ఆయన మూలాలు తెగిపోతాయని ఎగతాళి చేశాడు.
దానికి సమాధానంగా అల్లాహ్ సూరా అల్-కౌసర్ ను అవతరింపచేశాడు, దీనికి వ్యతిరేకంగా జరుగుతుందని చెప్పాడు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ద్వేషించే వారే కనుమరుగైపోతారు. సుబ్ హానల్లాహ్, ఇదే కచ్చితంగా జరిగింది. నేడు అబూ లహబ్ వారసత్వం ఎక్కడా మనకు కనిపించదు. కానీ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారసత్వం చరిత్రలో ఎవరికీ సాటిరాదు, అంతిమ దినం వరకు అలానే ఉంటుంది. ఆయన దేవుడి చివరి ప్రవక్త. ప్రవక్తలందరిలో అత్యుత్తముడు. ఆదర్శ పురుషుడు. అంతిమ దినం వరకు మానవజాతికి మార్గదర్శి.
పేర్లు పెట్టడం పక్కన పెడితే, ఆయన పవిత్ర నామం, అంటే “ప్రశంసించబడినవాడు”, ప్రతీ క్షణం ప్రపంచవ్యాప్తంగా వేల సార్లు ఉచ్చరించబడుతుంది. అది అజాన్, నమాజు, దురూద్, జిక్ర్ రూపంలో కావచ్చు. ఒక్క అజానే క్షణం కూడా ఆగకుండా కొనసాగినప్పుడు, ఆయన కోసం పఠించే దురూద్, ప్రశంసల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇది ఆయన నిజంగా దేవుని నిజమైన ప్రవక్త అని చెప్పడానికి సరిపడే సంకేతం కాదా? అల్లాహ్, సర్వశక్తిమంతుడు ఆశీర్వదించబడ్డాడు. ఆయన తన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను,ఆయన సృష్టి కోసం ఎంపిక చేసిన మతాన్ని నిజంగా గౌరవించాడు.
ఈ వ్యాసం రాస్తున్నప్పుడు ప్రముఖ విద్యావేత్త అయిన నాతోడ బుట్టిన తమ్ముడు అబ్దుల్ మాజిద్ ఫోన్ చేశాడు. ఆ సమయంలో నేను అతన్ని ‘ముహమ్మద్’ అనేది ముస్లింలలో అత్యంత ప్రజాదరణ పొందిన పేరు ఎందుకని నువ్వు భావిస్తున్నావు’’ అడిగాను. దానికతను “నిస్సందేహంగా, ముస్లింలు ముహమ్మద్ పేరును ఇష్టపడతారు ఎందుకంటే అది మన ప్రవక్త పేరు. ఇది ఇస్లామిక్ గుర్తింపును ప్రతిబింబిస్తుంది, అందుకే కొన్ని దేశాలలో ప్రజలు తమ బిడ్డకు ఎంచుకున్న పేరు ముందు ఈ పేరును జోడిస్తారు. “ప్రవక్త ముహమ్మద్ పేరు ప్రవక్త ఆదమ్ నుంచి భూమిపై ఉన్న చివరి వ్యక్తి వరకు మానవులకు ఉండాల్సిన అన్ని మంచి లక్షణాలకి ఒక నిదర్శనం. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆదర్శప్రాయమైన పేరు పెట్టడం ద్వారా, ఆశించిన స్థాయికి పెరుగుతారని ఆశిస్తారు.” అని అతను చెప్పుకొచ్చాడు.
“మన పేరుకున్న అర్థాలు మనపై ప్రభావం చూపుతాయని నేను అనుకుంటున్నాను. ముహమ్మద్ మన ప్రియమైన ప్రవక్త పేరు. ఆయన అత్యంత ధర్మాత్ముడిగా మరియు తెలిసినంతవరకు ఉత్తమ మానవుడిగా కూడా ప్రసిద్ధి పొందారు. బహుశా ప్రతి ఒక్కరూ తమ బిడ్డకు అన్ని రకాల సానుకూల ప్రభావాలు ఉండాలని కోరుకుంటారు, అందుకే ఈ పేరు ప్రాచుర్యం పొందుతోంది.” అని ప్రముఖ ఇస్లామిక్ స్కాలర్ ఆలియా బిన్తె మునీర్ తెలిపారు.
“మహమ్మద్ అత్యంత ప్రజాదరణ పొందిన పేరు, ఎందుకంటే ఇది మన ప్రియమైన ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పేరు. భూమిపై నడిచిన ఉత్తమ వ్యక్తి, మన ప్రభువుకు ప్రియమైనవాడు.” అని మరో స్కాలర్ మైమూనా ఫాతిమా తెలిపారు. “అల్లాహ్ సుభానహు వ త’ఆలా ఆయన పంపిన ప్రవక్త కోసం ఈ పేరును ఎంచుకున్నారు. కాబట్టి ఆయనకు అత్యంత ఇష్టమైన పేరు ఇదే అని మనకు తెలుసు. ఈ పేరుకు అర్థం – ‘అత్యధికంగా ప్రశంసించబడినవాడు’. మనం మన ప్రవక్తను మానవులందరి కంటే ఎక్కువగా ప్రేమిస్తాం. మన పిల్లలు ప్రవక్తను ఆదర్శంగా తీసుకొని, ఆయన తన జీవితకాలంలో జీవించిన విధంగానే ఆ లక్షణాలను అలవర్చుకోవాలని మేము కోరుకుంటాం.” అని తహూరా సిద్దీఖా అనే మరో స్కాలర్ తెలిపారు.
- ముహమ్మద్ ముజాహిద్, 9640622076