న్యూఢిల్లీ: బీహార్‌లో సవరించిన ఓటరు జాబితాలో చేర్చడానికి గుర్తింపు రుజువుగా సమర్పించగల “12వ పత్రం”గా ఆధార్ కార్డును చేర్చాలని సుప్రీంకోర్టు భారత ఎన్నికల సంఘం (ECI)ని ఆదేశించింది.
“బీహార్ సవరించిన ఓటరు జాబితాలో ఓటరును చేర్చడం/తొలగించడం కోసం ఒక వ్యక్తి గుర్తింపు కోసం ఆధార్ కార్డును కూడా పరిగణనలోకి తీసుకుంటారు” అని లైవ్‌లా ఉటంకించినట్లుగా, ECI సుప్రీంకోర్టు ముందు హామీ ఇచ్చింది.
ఎన్నికలకు ముందు బీహార్‌లో ECI చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధమని సవాలు చేస్తూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR), స్వరాజ్ పార్టీ సభ్యుడు యోగేంద్ర యాదవ్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సూర్యకాంత్, జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారిస్తున్న విషయం తెలిసిందే.
పిటిషన్ల వాదనలు విన్న తరువాత మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జాబితాలో చేర్చడానికి లేదా తొలగించడానికి ఆధార్ కార్డును కూడా కమిషన్ ప్రకటించిన ధ్రువీకరణ పత్రాల జాబితాలో 12వ పత్రంగా పరిగణించాలని పేర్కొంది. ఇది 1950 నాటికి ప్రజా ప్రాతినిధ్య చట్టానికి అనుగుణంగా తీసుకొన్న నిర్ణయమని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ జాబితాలో పాస్‌పోర్టు, బర్త్ సర్టిఫికెట్ వంటి 11 పత్రాలను ఐడీ ప్రూఫ్‌లుగా ఎలక్షన్ కమిషన్ స్వీకరిస్తోంది. కనుక తమ ఆదేశాలు ప్రజలకు తెలిసేలా ఎన్నికల కమిషన్ తన వెబ్‌సైట్‌లో ఆధార్ ధ్రువీకరణ పత్రం ఆమోదయోగ్యమే అని తెలుపుతూ ఓ నోటీసులు ప్రదర్శించాలని సుప్రీంకోర్టు సూచించింది.
భారతదేశ ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థస్వంత వెబ్‌సైట్ ప్రకారం…”భారతీయులకు గుర్తింపుకు, చిరునామాకు రుజువు”గా పనిచేసే ఆధార్ కార్డును బీహార్‌లో ఓటర్ల జాబితాల సవరణకు ఎన్నికల సంఘం అనుమతించిన 11 పత్రాల జాబితా నుండి మినహాయించారు, దీనివల్ల ఓటర్లు సామూహిక బహిష్కరణకు భయపడి పత్రాల కోసం వెతుకుతున్నారు.
బీహార్‌లో ఆధార్ కవరేజ్ 94% వద్ద ఉంది. మరోవంక సుప్రీంకోర్టు తన ఉత్తర్వులో ఆధార్ పౌరసత్వానికి రుజువు కాదని, గుర్తింపుకు మాత్రమే రుజువు అని స్పష్టం చేసింది. ఆధార్ కార్డును అంగీకరించడంపై క్షేత్రస్థాయిలో అధికారులకు సూచనలు జారీ చేయాలని ECIని ఆదేశించింది.
ఓటర్లు సమర్పించిన ఆధార్ కార్డుల ప్రామాణికత, వాస్తవికతను ధృవీకరించే హక్కు ECI అధికారులకు ఉంటుందని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది.