హైదరాబాద్: రాష్ట్ర ఆహార భద్రతా విభాగానికి చెందిన టాస్క్‌ఫోర్స్ హైదరాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్లపై నిన్న దాడులు నిర్వహించింది. ఆహార భద్రత కమిషనర్‌కు అందిన ఫిర్యాదుల ఆధారంగా 10 అబ్సొల్యూట్ బార్బెక్యూ అవుట్‌లెట్‌లపై దాడులు జరిగాయి.
బంజారా హిల్స్, ఇతర ప్రదేశాలలో తనిఖీలు
ఆహార భద్రత కమిషనర్ తన X హ్యాండిల్‌లో పంచుకున్న వివరాల ప్రకారం… హైదరాబాద్‌లోని AS రావు నగర్, కొంపల్లి, మేడిపల్లి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, ఇనార్బిట్, మియాపూర్, వనస్థలిపురం, సికింద్రాబాద్‌లలో ఉన్న ప్రముఖ రెస్టారెంట్లపై దాడులు జరిగాయి. ఈ రెస్టారెంట్లన్నీ అబ్సొల్యూట్ బార్బెక్యూ అవుట్‌లెట్‌లే కావడం గమనార్హం.
కాగా, హైదరాబాద్‌లోని ప్రసిద్ధ రెస్టారెంట్‌లపై దాడుల్లో అనేక లోపాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా పరిశుభ్రత, నాసిరకం ఆహార పదార్థాలను గుర్తించారు. అధికారులు వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని, సంబంధిత అవుట్‌లెట్లకు నోటీసులు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
బంజారా హిల్స్, గచ్చిబౌలి అవుట్‌లెట్లలో ఫ్రిజ్‌లు సరిగా శుభ్రం చేయకపోవడం, డీఫ్రాస్ట్ చేయకపోవడం గమనించారు. కూరగాయలు కోసే చాపింగ్ బోర్డులు పాడైపోయి, వాడకానికి వీల్లేకుండా ఉన్నాయి. బంజారా హిల్స్, గచ్చిబౌలి అవుట్‌లెట్లలో బొద్దింకలు, ఈగల బెడద అధికంగా ఉంది. ఏఎస్ రావు నగర్ అవుట్‌లెట్‌లో పురుగు పట్టిన పిండిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
మేడిపల్లి హోటల్‌లో గడువు ముగిసిన ఆహారాన్ని గుర్తించగా, ఇనార్బిట్ మాల్‌లో ఫంగల్ కారణంగా కుళ్ళిన పండ్లు ఉన్నట్లు తనిఖీల్లో తేలింది. ఆహార పదార్థాలను నేలపై నిల్వ ఉంచడం, ఎలుకలను పట్టుకునే ప్యాడ్స్‌తో పాటు వాటిని ఉంచడం వంటి నిర్లక్ష్యం కనిపించింది. రాక్స్‌పై ఎలుకల వ్యర్థాలు, తుప్పు పట్టిన, అపరిశుభ్రమైన నిల్వ పరికరాలను గుర్తించారు. కాగా, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్ 2020 ప్రకారం పాటించాల్సిన లేబులింగ్, డిస్‌ప్లే నిబంధనలను అవుట్‌లెట్లు ఉల్లంఘించాయి.
మొత్తంగా హైదరాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్‌లలో దాడుల తర్వాత…సదరు అవుట్‌లెట్లకు నోటీసులు జారీ చేసి, ఉల్లంఘనలపై వివరణ కోరారు. పలు ఆహార పదార్థాల నమూనాలను సేకరించి, వాటిని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. నివేదిక ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలను తీసుకుంటామని అధికారులు తెలిపారు.