హైదరాబాద్: నగరంలో మహిళల ఆర్థిక సాధికారతను ప్రోత్సహించడానికి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) స్వయం సహాయక బృందాలకు (SHGS) సహాయం చేస్తోంది. ఈ గ్రూపులు 33 ‘ఇందిరా మహిళా శక్తి’ క్యాంటీన్లను నిర్వహిస్తాయి.
మహిళలకు ఆర్థిక భద్రతను పెంపొందించడానికి ఈ పథకాన్ని గత సంవత్సరం ప్రారంభించారు. ఈ క్యాంటీన్లు మహిళలకు ఉపాధిని కల్పించడమే కాకుండా, వారు ఆత్మవిశ్వాసం, స్వావలంబన పొందడంలో సహాయపడటంతో పాటు నామమాత్రపు ధరకు ప్రజలకు పోషకమైన భోజనాన్ని కూడా అందిస్తున్నాయి.
ఈమేరకు NBT నగర్‌లోని స్నేహిత స్వయం సహాయక బృందంలోని వసంత, మరో నలుగురు సభ్యుల విజయగాథను GHMC షేర్ చేసింది. వారు బ్యాంకు నుండి రూ. 5 లక్షల రుణం తీసుకొని ఈ సంవత్సరం మార్చిలో GHMC ప్రధాన కార్యాలయంలో ఇంద్ర మహిళా శక్తి క్యాంటీన్‌ను స్థాపించారు. అప్పటి నుండి ఈ బృందం క్యాంటీన్‌ను విజయవంతంగా నిర్వహిస్తోంది, ఉద్యోగులు, సందర్శకులకు సేవలు అందిస్తోంది.
“ఈ అవకాశంతో, నేను, నా భాగస్వాములు క్యాంటీన్‌లో ఆర్థిక భద్రత పొందాము. మేము మా కాళ్ళపై నిలబడగలిగాము” అని క్యాంటీన్ మేనేజర్ వసంత తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.