జైపూర్: రాజస్థాన్‌లో మతమార్పిడి నిరోధక బిల్లు అటు మైనారిటీలు, ఇటు మతాంతర జంటల్లో తుఫానును రేకెత్తిస్తోంది. ఈ మేరకు రాజస్థాన్‌లో బలవంతపు, మోసపూరిత మతమార్పిడులను అరికట్టేందుకు భజన్‌లాల్ శర్మ ప్రభుత్వం అత్యంత కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చింది. మంగళవారం రాజస్థాన్ అసెంబ్లీ… ‘రాజస్థాన్ చట్టవిరుద్ధ మత మార్పిడి నిరోధక బిల్లు-2025’ను మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఇది భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్ర రాజకీయ దృశ్యంలో అలజడిని సృష్టించింది. ప్రధాన రాజ్యాంగ హక్కులను ప్రభావితం చేసే ఈ బిల్లును ప్రతిపక్ష పార్టీలు చర్చలో పాల్గొనకుండానే ఆమోదించారు.
ప్రభుత్వంలోని మంత్రులు సహా బిజెపి నాయకులు, ముస్లింల “లవ్ జిహాద్”, క్రైస్తవ మిషనరీల “బలవంతపు మతమార్పిడి”లను ఆపడానికి కొత్త చట్టం సహాయపడుతుందని పేర్కొన్నప్పటికీ, ప్రతిపక్ష కాంగ్రెస్ అసెంబ్లీలో బిల్లుపై చర్చను బహిష్కరించి, వాకౌట్ చేసింది, ఇది మత సామరస్యాన్ని దెబ్బతీస్తుందని, సమాజంలో ఉద్రిక్తతను సృష్టిస్తుందని ఆరోపించింది.
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఇలాంటి బిల్లును ఉపసంహరించుకుని,మళ్లీ కొత్త బిల్లుతో భర్తీ చేశారు. అసెంబ్లీలో దీనిని ఆమోదించడం ద్వారా మతమార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకురావడానికి బిజెపి ప్రభుత్వం చేస్తున్న మూడవ ప్రయత్నం ఇది. ఈ బిల్లు అమల్లోకి వచ్చిన తర్వాత, రాజస్థాన్ మతమార్పిడి నిరోధక చట్టం ఉన్న 12వ రాష్ట్రంగా అవతరిస్తుంది.
ప్రస్తుతం ఇటువంటి చట్టాలు ఉన్న రాష్ట్రాలు ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, జార్ఖండ్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. రాజస్థాన్ అసెంబ్లీలో చర్చ లేకుండానే బిల్లు ఆమోదం పొందడం, ప్రతిపాదిత చట్టాన్ని ఎలాగైనా ఆమోదించాలని కోరుకున్న స్పీకర్ ప్రజాస్వామ్య విధానం లేకపోవడాన్ని సూచిస్తుంది.
రాజ్యాంగంలో నిర్దేశించిన అన్ని ప్రాథమిక హక్కులను బిల్లు హరిస్తుందని పౌర హక్కుల సంఘాలు ఎత్తి చూపాయి. “మార్పిడి” నిర్వచనం నిపుణుల దృష్టిని ఆకర్షించింది. వారి “పూర్వీకుల మతం” లోకి తిరిగి వచ్చే వారిని చట్టం నుండి మినహాయించారు, బిల్లులోని సెక్షన్ 3 ప్రకారం”ఎవరైనా అసలు మతంలోకి అంటే పూర్వీకుల మతంలోకి తిరిగి మారితే, దానిని ఈ చట్టం ప్రకారం మతమార్పిడిగా పరిగణించకూడదు.”
రాజస్థాన్ చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ బిల్లు… పూర్వీకుల మతం అంటే విశ్వాసం కలిగి ఉన్న లేదా ఆచరించిన మతం అని కూడా వివరిస్తుంది. ఈ నిబంధన సంఘ్ పరివార్ నేతృత్వంలోని ‘ఘర్ వాపసీ’ కార్యక్రమానికి అనుగుణంగా ఉంటుంది.
ఈ కొత్త చట్టం ప్రకారం, మోసం, ప్రలోభం, లేదా భయపెట్టి మతం మార్పిస్తే 7 నుంచి 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. అదే మైనర్లు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారిని లక్ష్యంగా చేసుకుని మతమార్పిడికి పాల్పడితే శిక్ష మరింత కఠినంగా ఉంటుంది. అలాంటి కేసుల్లో 10 నుంచి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు కనీసం రూ. 10 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
ఈ బిల్లులోని అత్యంత కీలకమైన అంశం సామూహిక మతమార్పిడులకు సంబంధించినది. మోసపూరిత పద్ధతుల్లో సామూహిక మతమార్పిడులకు పాల్పడిన వారికి 20 సంవత్సరాల జైలు నుంచి యావజ్జీవ కారాగార శిక్ష వరకు విధించవచ్చు. దీనితో పాటు కనీసం రూ. 25 లక్షల జరిమానా కూడా విధిస్తారు. చట్టవిరుద్ధ మతమార్పిడుల కోసం విదేశీ నిధులు స్వీకరించినా కఠిన చర్యలు తప్పవు.
2006లో రాజస్థాన్‌లో అప్పటి ముఖ్యమంత్రి వసుంధర రాజే మతమార్పిడి నిరోధక చట్టాన్ని అమలు చేయడానికి ప్రయత్నించారు, కానీ కాంగ్రెస్, మానవ హక్కుల సంఘాలు,మైనారిటీ సంస్థల వ్యతిరేకత కారణంగా అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఆ బిల్లును తిరస్కరించారు. సవరించిన వెర్షన్ కూడా 2008లో కేంద్రం పెండింగ్‌లో పెట్టింది.
కాగా, బిజెపి ఎమ్మెల్యేలు బిల్లు నిబంధనలను ప్రశంసించారు. బిల్లు ఆమోదం సమాజంలో “శాంతి – సామరస్యాన్ని” కొనసాగించడానికి మార్గం సుగమం చేస్తుందని రాజస్థాన్ హోం శాఖ సహాయ మంత్రి జవహర్ సింగ్ బేధం అసెంబ్లీలో అన్నారు.