టెల్‌అవీవ్: ఇక ముందు పాలస్తీనా దేశం ఉండదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో వేలాది కొత్త గృహాలను నిర్మించనున్నట్లు వెల్లడించారు. జెరూసలేంకు తూర్పున ఉన్న ఈ ప్రాంతంలో వివాదాస్పద ‘E1’ సెటిల్‌మెంట్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై కూడా నెతన్యాహు సంతకం చేశారు.
“పాలస్తీనా రాజ్యం ఉండదన్న మా వాగ్దానాన్ని మేము నెరవేర్చబోతున్నాము, ఈ స్థలం మాది” అని నెతన్యాహు జెరూసలేంకు తూర్పున ఉన్న ఇజ్రాయెల్ స్థావరం మాలే అడుమిమ్‌లో జరిగిన కార్యక్రమంలో అన్నారు. “మేము మా వారసత్వాన్ని, మా భూమిని, మా భద్రతను కాపాడుకుంటాము…మేము నగర జనాభాను రెట్టింపు చేయబోతున్నామని ఆయన అన్నారు.
జెరూసలేంకు తూర్పున సుమారు 12 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ E1 ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టాలని ఇజ్రాయెల్ చాలాకాలంగా భావిస్తోంది. అయితే, అమెరికా, యూరోపియన్ దేశాల ఒత్తిడితో 2012 నుంచి 2020 వరకు ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. ఇప్పుడు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి కూడా తుది ఆమోదం లభించడంతో, ఈ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించారు. ఈ ప్రాంతంలో కొత్త రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనకు సుమారు 1 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా.
ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకున్న తూర్పు జెరూసలేంను మినహాయించి, వెస్ట్ బ్యాంక్ దాదాపు మూడు మిలియన్ల పాలస్తీనియన్లకు, అలాగే దాదాపు 500,000 మంది ఇజ్రాయెల్ సెటిలర్లకు నిలయంగా ఉంది.
కాగా, అంతర్జాతీయ చట్టాల ప్రకారం, వెస్ట్ బ్యాంక్‌లోని ఇజ్రాయెల్ సెటిల్‌మెంట్లు చట్టవిరుద్ధమని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలు చెబుతున్నాయి. నాలుగో జెనీవా ఒప్పందాన్ని ఇది ఉల్లంఘించడమేనని పలు దేశాలు వాదిస్తున్నాయి. అయితే, ఇజ్రాయెల్ ఈ వాదనలను మొదటి నుంచి ఖండిస్తోంది.
గత నెలలో, ఇజ్రాయెల్ రైట్‌వింగ్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ ఈ అత్యంత సున్నితమైన భూమిలో దాదాపు 3,400 ఇళ్లను నిర్మించే ప్రణాళికలకు మద్దతు ఇచ్చారు. కాగా, ఆయన ప్రకటనను UN చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ ఖండించారు. ఈ పరిణామం వెస్ట్ బ్యాంక్‌ను రెండుగా విభజించి, పక్కనే ఉన్న పాలస్తీనాకు “అస్తిత్వ ముప్పు” కలిగిస్తుందని అన్నారు.
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాలస్తీనాకు ప్రత్యేక దేశంగా గుర్తింపు ఇచ్చేందుకు కొన్ని పశ్చిమ దేశాలు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో నెతన్యాహు ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఖతార్‌లో హమాస్ నేతలపై దాడి విషయంలో అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ, ఇజ్రాయెల్ ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఒకవేళ మిత్రదేశాలు కూడా వ్యతిరేకిస్తే ఇజ్రాయెల్ ఒంటరిగా నిలబడాల్సి వస్తుంది. మొత్తంగా ఇజ్రాయెల్ దూకుడు వైఖరి భవిష్యత్తులో ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.