హైదరాబాద్: తెలంగాణలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ, ఫార్మసీ, ఇంజనీరింగ్ కళాశాలలు ఫీజు బకాయిలు భారీగా పేరుకుపోయాయి. ఇప్పటికే ప్రభుత్వం నుంచి రూ.8,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ రావాల్సి ఉన్న కారణంగా సెప్టెంబర్ 15 నుండి కాలేజీలను నిరవధికంగా మూసివేస్తామని బెదిరించాయి. దీనిపై కొద్ది నెలలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా ఫలితం లేదని పేర్కొంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బంద్ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
ఈ మేరకు సమాఖ్య ప్రతినిధులు శుక్రవారం తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డిని కలిసి బంద్ నోటీసు అందజేశారు. బడ్జెట్లో కేటాయించి.. ఇప్పటికే టోకెన్లు జారీ చేసిన రూ.1200 కోట్ల బకాయిలను కూడా ప్రభుత్వం విడుదల చేయలేదని వారు గుర్తు చేశారు.
సెప్టెంబర్ 18 నాటికి టోకెన్ మొత్తాన్ని విడుదల చేయాలని, బకాయిలు చెల్లిస్తే …కాలేజీల మూసివేతను కమిటీ పునఃపరిశీలిస్తుందని FATHI చైర్మన్ ఎన్. రమేష్ డిమాండ్ చేశారు.
రీయింబర్స్‌మెంట్‌లలో జాప్యం కారణంగా అధ్యాపకులు, సిబ్బంది జీతాలు నెలల తరబడి చెల్లించకపోవడంతో వారు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు జీతాలు ఇవ్వకపోవడంతో కొందరు అధ్యాపకులు బోధనను అంతగా సీరియ్‌సగా తీసుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది. దాంతో బోధనలో నాణ్యత తగ్గుతోందని, తర్వాతి కాలంలో విద్యార్థులు ఉద్యోగాలు సంపాదించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఈ నెల 15న నిర్వహిస్తున్న ‘ఇంజనీర్స్ డే’ రోజు నుంచి తమ సమ్మె ప్రారంభమవుతుందని ప్రకటించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రైవేటు కాలేజీల ప్రతినిధులు పేర్కొన్నారు.
ఈమేరకు యాజమాన్య సంఘాల ప్రతినిధులు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాను కూడా కలిసి నోటీసు అందజేశారు. సున్నితమైన ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని ఆమె హామీ ఇచ్చారు. మరోవైపు ఈ విషయంపై చర్చలకు రావాల్సిందిగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి కళాశాలల యాజమాన్య సంఘాల ప్రతినిధులను ఆహ్వానించారు. ఆ మేరకు నేడు చర్చలు జరగనున్నాయి.