న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పునిచ్చింది. వక్ఫ్ (సవరణ) చట్టం-2025 లోని కొన్ని నిబంధనలను సుప్రీంకోర్టు నిలిపివేసింది. గత ఐదు సంవత్సరాలుగా ఇస్లాంను ఆచరిస్తున్న వారు మాత్రమే వక్ఫ్‌ను ఇవ్వాలన్న కీలక నిబంధనల అమలును నిలిపివేసింది. అంతేకాదు ప్రభుత్వ ఆస్తిని వక్ఫ్ బోర్డు ఆక్రమించిందా లేదా అనే వివాదాన్ని నిర్ణయించడానికి ప్రభుత్వం నియమించిన అధికారికి వీలు కల్పించే నిబంధనను కూడా ఇది నిలిపివేసింది. ఇక వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ముస్లిమే ఉండటం మంచిదని పేర్కొంది.
-వక్ఫ్ ఆస్తులు అవునా? కాదా? అన్నది కోర్టులే నిర్ణయిస్తాయని పేర్కొంది.
-వక్ఫ్ ఆస్తుల గుర్తింపులో కలెక్టర్లకు అధికారం ఇవ్వడంపై స్టే విధించింది.
-ఇప్పటికే వక్ఫ్‌గా గుర్తించిన ఆస్తుల స్థితిగతులను మార్చకూడదని సూచించింది.
-రాష్ట్ర వక్ఫ్ బోర్డులు, కేంద్ర వక్ఫ్ కౌన్సిల్‌లలో ముస్లిమేతరుల సంఖ్య ముగ్గురికి మించరాదని కూడా పేర్కొంది.
ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వును ప్రకటిస్తూ… అదే సమయంలో వక్స్ (సవరణ) చట్టం- 2025పై మొత్తంగా స్టే విధించడానికి నిరాకరించింది. కొన్ని సెక్షన్లకు మాత్రం రక్షణ అవసరమని వ్యాఖ్యానించింది. వక్స్ బోర్డులో ముస్లిం సభ్యుల సంఖ్య కచ్చితంగా మెజార్టీలో ఉండాలని కోర్టు పేర్కొంది. బోర్డ్ లేదా కౌన్సిల్లో అత్యధికంగా ముగ్గురు లేదా నలుగురు ముస్లిమేతర సభ్యులు ఉండాలని చెప్పింది.
మే 22న సుప్రీంకోర్టు మూడు కీలక అంశాలపై తన తీర్పును రిజర్వ్ చేసింది, వాటిలో “కోర్టుల ద్వారా వక్ఫ్, వినియోగదారుని ద్వారా వక్ఫ్ లేదా డీడ్ ద్వారా వక్ఫ్”గా ప్రకటించిన ఆస్తులను డీనోటిఫై చేసే అధికారం కూడా ఉంది, ఇది వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా తలెత్తింది.