Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

పాతబస్తీ వాసులకు శుభవార్త…ప్రారంభమైన పాస్‌పోర్ట్ సేవా కేంద్రం!

Share It:

హైదరాబాద్: చాదర్‌ఘాట్‌లో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటుతో పాతనగరవాసుల చిరకాల వాంఛ తీరింది. ఈమేరకు ఎంజిబిఎస్ మెట్రో స్టేషన్‌లో తొలి పాస్‌పోర్ట్ సేవా కేంద్రం (పిఎస్‌కె) ప్రారంభమైంది. రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దీనిని ప్రారంభించారు. తద్వార తెలంగాణలో పాస్‌పోర్ట్ సేవలను మరింత విస్తరిస్తున్నారు. రోజుకు దాదాపు 4,500 పాస్‌పోర్ట్‌లను ప్రాసెస్ చేయగల సామర్థ్యంతో, పాస్‌పోర్ట్ జారీలో తెలంగాణ దేశంలో ఐదవ అత్యధిక రాష్ట్రంగా అవతరించిందని మంత్రి అన్నారు.

దేశంలో మెట్రో స్టేషన్ లోపల ప్రారంభించిన మొదటి పాస్‌పోర్ట్‌ కేంద్రం ఇదే కావడం గమనార్హం. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బేగంపేట ప్రధాన కార్యాలయంగా రాష్ట్రంలో ఐదు పీఎస్‌కేలు ఉన్నాయని, మిగతావి ఎంజీబీఎస్, టోలిచౌకి, నిజామాబాద్, కరీంనగర్ లలో ఉన్నాయని అన్నారు. డిమాండ్ ను తీర్చడానికి ఎంజీబీఎస్ కేంద్రం సామర్థ్యాన్ని 750 నుండి 1,200 స్లాట్లకు పెంచాలని, కరీంనగర్ కేంద్రంలో స్లాట్లను 250 నుండి 500కి పెంచాలని మంత్రి సూచించారు.

పాస్‌పోర్ట్‌లు ఆధార్ లాగానే అవసరమని పొన్నం ప్రభాకర్ నొక్కిచెప్పారు, గతంలో చాలా మంది కార్మికులు గల్ఫ్ దేశాలకు ప్రయాణించగా, నేడు విద్యార్థులు, నిపుణులు విద్య – ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్నారని పేర్కొన్నారు. “విదేశాలలో భారతీయుడిగా గుర్తింపు పొందాలంటే పాస్‌పోర్ట్ తప్పనిసరి” అని మంత్రి అన్నారు. MGBSలో ప్రారంభించిన PSK కొత్త PSK కాదు, అమీర్‌పేటలో ఉన్న కేంద్రాని ఇక్కడికి మార్చారు. దీనితో పాటు, టోలిచౌకి PSK రాయదుర్గంలోని సిరి భవనానికి మార్చారు. కీలకమైన రవాణా కేంద్రంలో ఉన్న MGBS కేంద్రం… వివిధ జిల్లాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని, మెట్రో, బస్సు సౌకర్యాల ద్వారా ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చని పొన్నం ప్రభాకర్ అన్నారు.

దరఖాస్తుదారులతో మర్యాదగా వ్యవహరించాలని సిబ్బందిని కోరారు. పాస్‌పోర్ట్‌లను త్వరగా జారీ చేయడానికి వీలుగా ధృవీకరణను వేగవంతం చేయాలని పోలీసు శాఖను కోరారు. ఈ సందర్భంగా, పాత నగరంలో కేంద్రాన్ని ఏర్పాటు చేయడాన్ని అసదుద్దీన్ ఒవైసీ ప్రశంసించారు. ఈ సందర్భంగా 1976లో బేగంపేట పాస్‌పోర్ట్ కార్యాలయం మొదటిసారిగా ఏర్పాటు చేసినప్పుడు ఎదుర్కొన్న సవాళ్లను ఆయన గుర్తు చేసుకున్నారు. పాస్‌పోర్ట్ జారీలో హైదరాబాద్ అగ్రస్థానంలో కొనసాగుతుందని పేర్కొన్నారు. పోలీసు ధృవీకరణలను వేగవంతం చేయాలని అసద్ ఒవైసీ తెలంగాణ పోలీసులను కోరారు.

మరోవంక తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు రాయదుర్గంలో మరో పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. పౌరుల నుండి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి హైదరాబాద్‌లో పీఎస్‌కేలను ఏర్పాటు చేయాలని మంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ అన్ని దిశల్లో వేగంగా విస్తరిస్తున్నదని, నగర జనాభా క్రమంగా పెరుగుతున్నందున, ముఖ్యంగా పాస్‌పోర్ట్ విభాగంలో మెరుగైన ప్రజా సేవా మౌలిక సదుపాయాల అవసరం ఉందని శ్రీధర్ బాబు అన్నారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి, ఎంఎల్‌సి రియాజ్-ఉల్ హసన్ ఎఫెండి, జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కేంద్ర మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ కెజి శ్రీనివాస ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.