హైదరాబాద్: తెలంగాణలో తొమ్మిది రోజుల పూల పండుగ ‘బతుకమ్మ’ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైంది. వరంగల్‌లో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ… తొమ్మిది రోజుల పాటు (సెప్టెంబర్ 30 వరకు) ప్రకృతిలో లభించే పువ్వులను ఉపయోగించి మహిళలు గౌరమ్మ దేవిని భక్తి, విశ్వాసంతో పూజిస్తారని అన్నారు. వారి ప్రార్థనలు ఫలించాలని, రాష్ట్రం, ప్రజలకు శ్రేయస్సును ప్రసాదించాలని ఆయన అన్నారు.
తెలంగాణ సంగీత అకాడమీ వెయ్యి స్తంభాల గుడిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న విక్రమార్క …తెలంగాణ సాంస్కృతిక శాఖ పర్యవేక్షణలో రాష్ట్రవ్యాప్తంగా ఈ పండుగను జరుపుకుంటున్నట్లు చెప్పారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఆర్థికంగా,సాధికారత పొందాలని ఆయన నొక్కి చెప్పారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారని విడుదల తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా తెలంగాణ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. “తెలంగాణ స్థానిక సంస్కృతి,సంప్రదాయాలకు,బతుకమ్మ రూపంలో గౌరీ (పార్వతి) దేవికి ప్రార్థనలు చేయడం ఈ పండుగ నిజమైన నివాళి” అని గవర్నర్ రాజ్ భవన్ విడుదలలో తెలిపారు.
తెలంగాణ ప్రజలకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ. 9 రోజుల పాటు అంగ రంగ వైభవంగా జరుపుకునే పెద్ద పండుగ . మనిషి జీవితం ప్రకృతితో విడదీయరాని అనుబంధం పెనవేసుకుని ఉంటుందని తెలియజెప్పే పండుగ బతుకమ్మ. పూలను పూజించే విశిష్టమైన పండుగ బతుకమ్మ. ఆడబిడ్డలందరూ అత్తవారింటి నుంచి పుట్టింటికి చేరి తీరొక్క పూలను సేకరించి ఆనందంగా అంగరంగ వైభవంగా బతుకమ్మ పండగను జరుపుకుంటారు. ప్రతి ఏడాది ఈ బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్య రోజు నుంచి ప్రారంభమై.. 9 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు.
ఈక్రమంలో ఈ ఏడాది కూడా సెప్టెంబర్ 21 నుంచి 30వ తేదీ వరకు జరపుకోనున్నారు. ఈ 9 రోజులు ఆడపడుచులు రోజూ ఓ రూపంలో బతుకమ్మను ఆరాధిస్తారు. మొదటిరోజు ఎంగిలి పూల బతుకమ్మ,2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నాన బియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ.
ఈ తొమ్మిది రోజులలో వీరు రోజూ బతుకమ్మలు చేసి, ప్రతీ సాయంత్రం వాటి చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తర్వాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు. చివరి రోజు సద్దుల బతుకమ్మ పండుగ రోజు మగవారంతా పచ్చిక బయళ్లలోనికి పోయి తంగేడు, గునుగు మొదలగు పూలను భారీగా ఏరుకుని వస్తారు. ఆ తరువాత ఇంటిల్లపాదీ కూర్చుని ఆ పూలతో బతుకమ్మను తయారు చేస్తారు.
చీకటి పడే సమయంలో స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకుని ఊరిలో ఉన్న పెద్ద చెరువు వైభవంగా ఊరేగింపుగా బయలుదేరుతారు. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు.