న్యూఢిల్లీ: సెప్టెంబర్ 30 నాటికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కోసం సిద్ధం కావాలని భారత ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల అధికారులను ఆదేశించింది. అక్టోబర్‌లో నవంబర్ మొదటి వారం వరకు దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉందని చెబుతున్నారు.
న్యూఢిల్లీలో జరిగిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారుల (CEOలు) సమావేశంలో, ఎన్నికల కమిషన్‌లోని ఉన్నతాధికారులు సెప్టెంబర్ 30 లోపు SIR కోసం సిద్ధం కావాలని ఆదేశించారని అధికారులు ధృవీకరించారు.
2008లో ఢిల్లీలో, 2006లో ఉత్తరాఖండ్‌లో, 2003లో బీహార్‌లో చివరిసారిగా ‘సర్’ను నిర్వహించారు. మిగతా రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను 2002 నుంచి 2004 మధ్య పూర్తి చేశారు. పలు రాష్ట్రాల సీఈవోలు ఇప్పటికే ఈ జాబితాలను వెబ్‌సైట్లలో అప్‌లోడ్ కూడా చేశారు. కాగా బీహార్ తర్వాత దేశవ్యాప్తంగా ‘SIR’ను అమలు చేస్తామని ఈసీ ప్రకటించింది.
ప్రతి రాష్ట్రంలో నిర్వహించిన తుది SIR ప్రకారం బీహార్‌లో ప్రక్రియకు సహజ కటాఫ్ తేదీని నిర్ణయిస్తారు, ఉదాహరణకు 2003 ఓటరు జాబితాను రిఫరెన్స్ పాయింట్‌గా పరిగణిస్తున్నారు. బీహార్ కసరత్తు ముగిసిన తర్వాత SIR ప్రక్రియను దేశవ్యాప్తంగా విస్తరిస్తామని కమిషన్ ప్రకటించింది. కాగా, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో అసెంబ్లీ ఎన్నికలు 2026లో జరగనున్నాయి.
బీజేపీకి లబ్ధి చేకూర్చడానికి, లక్షిత ఓటర్లను ఏరివేయడానికే ఈ ‘సర్’ను తీసుకొచ్చారని ప్రతిపక్షాలు విమర్శించాయి. దీంతో ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఎన్నికల సమయంలోనే ‘సర్’ను నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఈసీని సుప్రీంకోర్టు నిలదీసింది. చట్టవిరుద్ధంగా ‘సర్’ ఉన్నట్టు తేలితే, దాన్ని రద్దు చేస్తామని హెచ్చరించింది. బీహార్‌లో ‘సర్’ ప్రక్రియ చెల్లుబాటుపై అక్టోబర్ 7న తుది వాదనలు వింటామని పేర్కొంది. ఈ కేసు విచారణ జరుగుతుండగానే.. అన్ని రాష్ర్టాల్లో ‘సర్’ను అమలు చేయడానికి ఈసీ సమాయత్తమవ్వడం చర్చనీయాంశంగా మారింది.