న్యూఢిల్లీ: పశువైద్య శాస్త్రాలలో సహకార పరిశోధన, విద్యా కార్యకలాపాలను ప్రోత్సహించడానికి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద శాస్త్ర (CCRAS),హైదరాబాద్‌కు చెందిన PV నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం (PVNRTVU) మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది.
ఈ ఒప్పందం ముఖ్యాంశాలలో ఉమ్మడి పరిశోధన, విద్యా కార్యక్రమాలు ఉన్నాయి. వీటిలో భాగంగా రెండు సంస్థల నుండి అధ్యాపకులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు పరస్పర ఆసక్తి ఉన్న రంగాలలో సహకార ప్రాజెక్టులను చేపడతారు. పరిశోధన, పశువుల నిర్వహణ, పోషకాహారం, జంతువులకు రోగ నిర్ధారణ, చికిత్సా విధానాల అభివృద్ధిపై ప్రాధాన్యత ఉంటుంది.
ఈ అవగాహన ఒప్పందం జాయింట్ కోఆర్డినేషన్ కమిటీ (CC) ఆమోదానికి లోబడి ఉంటుంది, తద్వారా సహకార పని కోసం ప్రత్యేక వనరుల వినియోగాన్ని మెరుగుపరుస్తుందని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది CCRAS మంత్రిత్వ శాఖ కింద ఒక స్వయంప్రతిపత్తి సంస్థ.
ఈ ఒప్పందంలో విద్యార్థి,అధ్యాపకుల మార్పిడి కూడా ఉంటుంది. దీని కింద CCRAS శాస్త్రవేత్తలను PVNRTVUలో M.Sc. మరియు PhD విద్యార్థులకు అనుబంధ అధ్యాపకులు లేదా సహ-సలహాదారులుగా నియమించవచ్చు.
ఈ ఒప్పందం PVNRTVU విద్యార్థులకు ఉపన్యాసాలు, ఆచరణాత్మక ప్రదర్శనలు, ప్రాజెక్ట్ పనుల కోసం CCRAS ప్రయోగశాలలను సందర్శించడానికి కూడా వీలు కల్పిస్తుంది. అంతేకాకుండా, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఆహార శాస్త్రాలు, ఆరోగ్యం, పరిశోధనలో అవకాశాలను పొందుతారని ప్రకటన పేర్కొంది.
పరిశోధన ఫలితాలు ఓపెన్-యాక్సెస్ జర్నల్స్‌లో ప్రచురిస్తారు. రెండు సంస్థల నుండి విద్యార్థులకు తగిన క్రెడిట్ ఉంటుంది. ఉమ్మడి ప్రాజెక్టుల ద్వారా వచ్చిన ఫలితాలు ఇరువురికి స్వంతం అవుతాయి. ఆర్థిక ప్రయోజనాలు సహకారాల ప్రకారం దామాషా పద్దతిలో పంచుకుంటారని ఆ ప్రకటన తెలిపింది.
ఐదు సంవత్సరాల ప్రారంభ కాలానికి చెల్లుబాటు అయ్యే ఈ ఆర్థికేతర అవగాహన ఒప్పందం, క్లిష్టమైన జంతు, మానవ ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడానికి ఆధునిక పశువైద్య శాస్త్రాన్ని సాంప్రదాయ ఆయుర్వేద జ్ఞానంతో అనుసంధానించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు.
ఈ భాగస్వామ్యం జంతు సంక్షేమం, పశువుల ఉత్పత్తికి వినూత్న పరిష్కారాలను రూపొందిస్తుందని, విస్తృత “వన్ హెల్త్” భావనను ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు.