ఐక్యరాజ్యసమితి: భారతదేశం,పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపివేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి 80వ జనరల్ అసెంబ్లీ సమావేశానికి వచ్చిన ప్రపంచ నాయకులకు తన వాదనను పునరావృతం చేశారు.
“అదేవిధంగా, కేవలం ఏడు నెలల కాలంలో, నేను ఏడు యుద్ధాలను ఆపా. లేకుంటే అవి ఎప్పటికీ ముగియవని చెప్పారు… కొన్ని 31 సంవత్సరాలు కొనసాగగా, మరొకటి 36 సంవత్సరాలు, ఇంకోకటి 28 సంవత్సరాలు కొనసాగాయని, ట్రంప్ తన ప్రసంగంలో అన్నారు.
ఈ యుద్ధాలలో లెక్కలేనన్ని వేల మంది మరణించారు. ఇందులో కంబోడియా- థాయిలాండ్, కొసావో – సెర్బియా, కాంగో – రువాండా ఉన్నాయి. పాకిస్తాన్ – భారతదేశం, ఇజ్రాయెల్ – ఇరాన్, ఈజిప్ట్ – ఇథియోపియా, అర్మేనియా – అజర్‌బైజాన్‌ల మధ్య జరిగిన యుద్ధాలను ఆపానని ట్రంప్ పేర్కొన్నారు.
మే 10న, వాషింగ్టన్ మధ్యవర్తిత్వం వహించి “సుదీర్ఘ రాత్రి” చర్చలు జరిపిన తర్వాత భారతదేశం, పాకిస్తాన్ ” తక్షణ” కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ సోషల్ మీడియాలో ప్రకటించినప్పటి నుండి, భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను “పరిష్కరించడానికి తాను సహాయం చేశానని” దాదాపు 50 సార్లు ట్రంప్ తన వాదనను పునరావృతం చేశారు.
మూడవ పక్షం జోక్యాన్నిఖండించిన భారత్!
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడిలో 26 మంది పౌరులు మరణించినందుకు ప్రతీకారంగా భారతదేశం మే 7న పాకిస్తాన్, పాక్‌ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. నాలుగు రోజుల పాటు జరిగిన తీవ్రమైన సంఘర్షణను ముగించడానికి భారత్, పాకిస్తాన్ మే 10న ఒక అవగాహనకు వచ్చాయి.
పాకిస్తాన్‌తో శత్రుత్వ విరమణపై రెండు సైన్యాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMOలు) ప్రత్యక్ష చర్చల తర్వాత అవగాహన కుదిరిందని భారతదేశం చెబుతోంది. ఏ దేశ నాయకుడూ ఆపరేషన్ సిందూర్‌ను ఆపమని భారతదేశాన్ని కోరలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటులో స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ తీసుకురావడంలో మూడవ పక్షం జోక్యం లేదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టంగా చెప్పారు.