న్యూయార్క్: ఐక్య రాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహుకు శృంగభంమైంది. ఆయన మాట్లాడటం ప్రారంభించగానే పాలస్తీనాకు మద్దతుగా బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, బెల్జియం, ఆస్ట్రేలియాతో సహా పలు అరబ్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు నినాదాలు చేసుకుంటూ వాకౌట్ చేశాయి. నెతన్యాహు ప్రసంగాన్ని నిరసిస్తూ వారంతా వెళ్లిపోవడంతో సభలో అనేక సీట్లు ఖాళీగా దర్శనం ఇచ్చాయి. గాజాపై విధ్వంసకర యుద్ధాన్ని కొనసాగిస్తానని ఆయన ప్రతిజ్ఞ చేస్తున్నప్పుడు, ఆయనకు అపహాస్యం ఎదురైంది. మద్దతుగా చప్పట్లు కూడా వినిపించాయి.
గాజాలో తాము అనుకున్నది సాదిస్తామని సమావేశంలో చెప్పుకొచ్చారు. మరోవైపు నెతన్యాహు కార్యాలయం ఇజ్రాయిల్ సరిహద్దు వైపు ట్రక్కులపై లౌడ్స్పీకర్లు ఏర్పాటు చేయాలని, అందరూ అధ్యక్షుడి మాటలను వినేలా ఏర్పాట్లు చేయాలని సైన్యాన్ని ఆదేశించింది. “మేము మిమ్మల్ని ఒక్క క్షణం కూడా మర్చిపోలేదు. ఇజ్రాయెల్ ప్రజలు మీతో ఉన్నారు” అని ఆయన బందీలతో అన్నారు. హమాస్‌కు పంపిన సందేశంలో, “మీ చేతులు కింద పెట్టండి. నా ప్రజలను వెళ్లనివ్వండి” అని ఆయన అన్నారు. అలా చేస్తే, మీరు బతుకుతారు. మీరు అలా చేయకపోతే, ఇజ్రాయెల్ మిమ్మల్ని వేటాడుతుంది” అని హమాస్‌ను బెదిరించారు.
“పాశ్చాత్య నాయకులు ఒత్తిడికి తలొగ్గవచ్చు” అని నెతన్యాహు అన్నారు, అయితే “ఇజ్రాయెల్ లొంగదు” అని ఆయన హామీ ఇచ్చారు. పాలస్తీనా దేశ హోదాను గుర్తించిన దేశాలను ఆయన విమర్శించారు. వారి నిర్ణయం “అవమానకరమైనది” అని, “యూదులపై, ప్రతిచోటా అమాయక ప్రజలపై ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది” అని అన్నారు.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ “ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకోవడానికి నేను అనుమతించను. అది జరగదు” అని చెబుతూ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు, “దీనిని ఇప్పుడే ఆపాల్సిన సమయం ఆసన్నమైంది” అని అన్నారు.
కాగా, ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో అనేక దేశాల ప్రతినిధులు గాజాలో తక్షణ శాంతి నెలకొనాలని, సాయం పంపాలని డిమాండ్ చేశారు. గాజాలో 65 వేల మందికి పైగా పాలస్తీనియన్లను ఇజ్రాయిల్ సైన్యం చంపిందని, 90% జనాభాను నిరాశ్రయులను చేసిందని, ఆకలి బాధలు పెరుగుతున్నాయని వారు ఆందోళన వ్వక్తం చేశారు.