న్యూఢిల్లీ: ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్‌ను ఆయన భార్య గీతాంజలి అంగ్మో తీవ్రంగా ఖండించారు. తన భర్తను లడఖ్ నుండి తీసుకెళ్లిన అధికారులెవరి నుండి తనకు ఎటువంటి సమాచారం రాలేదని, 48 గంటలకు పైగా గడిచిందని ఆంగ్మో చెప్పారు. నాలుగు సంవత్సరాల క్రితం లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో వాంగ్‌చుక్ కోసం కేంద్రం వేట మొదలెట్టిందని ఆంగ్మో ఆరోపించారు. అంతేకాదు తమ లాభాపేక్షలేని సంస్థల్లో ఒకటైన హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్, లడఖ్ (HIAL) కోసం విదేశీ నిధులను స్వీకరించడానికి లైసెన్స్ కోసం దరఖాస్తును ఆపేసిందని ఆమె చెప్పారు.
మరో లాభాపేక్షలేని సంస్థ స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ లడఖ్ (SECMOL)కు ఇప్పటికే విదేశీ సహకార నియంత్రణ చట్టం (FCRA) కింద లైసెన్స్ ఉందని, గత వారం హోం మంత్రిత్వ శాఖ దానిని రద్దు చేసిందని, ఆంగ్మోతెలిపారు.
లడఖ్‌కు రాష్ట్ర హోదా కోసం, ఈ పర్వత ప్రాంతాన్ని ఆరవ షెడ్యూల్ కిందకు తీసుకురావాలనే ఆకాంక్షతో, బిజెపికి పెద్ద సంఖ్యలో ఓటు వేసి, ప్రతి మలుపులోనూ ఆ పార్టీకి మద్దతు ఇచ్చినప్పటికీ, బీజేపీతో ఇబ్బంది ప్రారంభమైందని ఆంగ్మో NDTVకి ఇచ్చిన ఇంటర్య్వూలో తెలిపారు.
వాంగ్‌చుక్ స్వయంగా బిజెపికి ఓటు వేశారు. వారిని అధికారంలోకి తీసుకురావడానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కాషాయపార్టీకే ఓటు వేశారు. ఎందుకంటే బీజేపీ మా అవసరాలను తీరుస్తోందని ఆమె అన్నారు. వాంగ్‌చుక్‌కు పాకిస్తాన్‌తో సంబంధం ఉందని లడఖ్‌లోని ఒక సీనియర్ పోలీసు అధికారి చేసిన ఆరోపణలను “హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వైఫల్యం”గా ఆంగ్మో అభివర్ణించారు.
లడఖ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ SD సింగ్ జామ్వాల్ శనివారం విలేకరుల సమావేశంలో వాంగ్‌చుక్ పాకిస్తాన్ వెళ్లడాన్ని ప్రశ్నించారు. లడఖ్‌కు చెందిన కార్యకర్త… డాన్ వార్తాపత్రిక పాకిస్తాన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారని, భారత సంతతికి చెందిన పాకిస్తానీ వ్యక్తి (PIO)తో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన అన్నారు.
“వారు అలాంటిదేదో కనుగొంటే అది హోం మంత్రిత్వ శాఖ వైఫల్యం. ఒక పాకిస్తానీ నిఘా వ్యక్తి ఇక్కడ తిరుగుతున్నందుకు MHA ఏమి చేస్తోంది? వారు తమ విధిని నిర్వర్తించడంలో విఫలమయ్యారు. వారు జవాబుదారీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను” అని అంగ్మో అన్నారు.
వాతావరణ మార్పులపై పనిచేస్తున్న వ్యక్తిగా, శాస్త్రవేత్తగా తన భర్త బ్రీత్ పాకిస్తాన్ కార్యక్రమంలో ఒక సమావేశానికి వెళ్లాడని ఆమె NDTVకి తెలిపింది. “ఇది ఐక్యరాజ్యసమితి ఆదేశం మేరకు జరిగిన సమావేశం… ఇది హిమాలయ ప్రాంతంలోని అందరితో కలిసి పనిచేస్తుందని ఆమె అన్నారు.
తన భర్త రెచ్చగొట్టే ప్రసంగం జనాలను హింసాత్మకంగా మార్చడానికి ప్రేరేపించిందనే హోం మంత్రిత్వ శాఖ ఆరోపణలను ఆమె తోసిపుచ్చింది. నిరసనకారులకు హాని జరగకూడదని వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను వెంటనే విరమించారని, హింసను ఖండించారని ఆమె అన్నారు.
సోనమ్ వాంగ్‌చుక్‌పై ఎన్ఎస్ఏను ప్రయోగించటం దారుణం. ఆయన ఎన్నడూ శాంతిభద్రతలకు విఘాగతం కలిగించే పని చేయలేదు. ఆయన ఎప్పుడూ గాందీమార్గంలోనే ఉద్యమం నడిపారని ఆయన భార్య అన్నారు.
కాగా, వాంగ్‌చుక్‌ను అరెస్ట్‌చేసిన నాటినుంచి ఆయనతో కనీసం మాట్లేందుకు కూడా పోలీసులు అనుమతించడం లేదని ఆయన భార్య గీతాంజలి అంగ్మో ఆరోపించారు.