Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

తెలంగాణలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌!

Share It:

హైదరాబాద్: తెలంగాణలో స్థానిక ఎన్నికలకు నగారా మోగింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. మొత్తం ఐదు దశల స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రవర్తనా నియమావళి (MCC) తక్షణమే అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇది అమలులో ఉంటుంది.

ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ఆంక్షలు ఉంటాయి. ఎన్నికల సందర్భంగా అక్రమ నగదు రవాణా అరికట్టేందుకు అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తారు. నేటి నుంచి ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఒక సామాన్య వ్యక్తి రూ. 50 వేల వరకు మాత్రమే నగదు తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది. ఎన్నికల కమిషన్ సూచించిన దానికంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా, సరైన పత్రాలు లేకపోతే ఆ నగదును అధికారులు సీజ్ చేస్తారు.

ఎక్కువ మొత్తంలో నగదు దొరికితే.. ఎన్నికల అధికారులు ఐటీ (IT), జీఎస్టీ అధికారులకు సమాచారం అందించి ఆ డబ్బును కోర్టులో జమ చేస్తారు. తక్కువ మొత్తంలో దొరికిన డబ్బును రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారు. ప్రజాప్రతినిధులు, సాధారణ ప్రజలు ఎన్నికల నిబంధనలను పాటించాలని, అనవసర ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నగదుకు సంబంధించిన తగిన ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

అత్యవసర వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, పెళ్లిళ్లు వంటి ముఖ్యమైన అవసరాలకు పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లేవారు తప్పనిసరిగా సరైన ఆధారాలు వెంట ఉంచుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ పత్రాలను చూపించగలిగితే.. జప్తు చేసిన డబ్బును తిరిగి ఇస్తారు.

అధికారులకు చూపించాల్సిన ఆధారాలు:

  • బ్యాంకు లావాదేవీల్లో నగదు డ్రా చేసిన అకౌంట్ పుస్తకం లేదా ఏటీఎం స్లిప్‌
  • వ్యాపార లావాదేవీల్లో వస్తువులు లేదా ధాన్యం విక్రయించిన డబ్బు అయితే దానికి సంబంధించిన బిల్లులు…
  • ఆస్తి లావాదేవీల్లో భూమి విక్రయించిన సొమ్ము అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు…
  • వ్యాపారం లేదా సేవల ద్వారా వచ్చిన డబ్బు అయితే లావాదేవీల పూర్తి వివరాలు సమర్పించాలి.

కాగా, రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 565 మండలాల్లో మొత్తం ఐదు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచే ప్రారంభమవుతుంది. మెుత్తం ఐదు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీడీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రక్రియ నవంబర్ 11తో ముగుస్తుంది.

ఈ ఎన్నికలలో 1.67 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలలో పోలైన ఓట్లను నవంబర్ 11న లెక్కించనున్నారు, పోలింగ్ తర్వాత గ్రామ పంచాయతీలలో లెక్కింపు చేపడతారు.

31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి. 565 జెడ్‌పిటిసిలు, 5,749 ఎంపిటిసిలు, 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డులకు పోలింగ్ జరుగుతుంది.

బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పేపర్‌లను ఉపయోగించి పోలింగ్ నిర్వహించనున్నారు. బ్యాలెట్ బాక్స్‌లను గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుండి తీసుకున్నారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.