హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల కమిషన్ తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ ఓటర్ లిస్ట్ ప్రకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 3లక్షల 99వేల మంది ఉన్నారు. ఈ లెక్కల ప్రకారం 1.61 శాతం ఓటర్ల పెరిగారు. ఇందులో పురుషులు 2లక్షల 7వేల 382 మంది, మహిళలు లక్షా 91వేల 593 మంది, ట్రాన్స్‌జెండర్లు 3,98,982 మంది ఉన్నారు. పోలింగ్ స్టేషన్‌కు సగటున 980 మంది ఓటర్లతో 139 భవనాల్లో మొత్తం 407 పోలింగ్ స్టేషన్‌లను కేటాయించారు.
ఓటర్లు తుది ఓటరు జాబితాలో తమ పేర్లను ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ ద్వారా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO)తో ధృవీకరించుకోవచ్చు లేదంటే ఓటరు హెల్ప్‌లైన్ యాప్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తుది ఓటర్ల జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలను ఫారం-6 (ఓటర్ల జాబితాలో పేరు చేర్చడానికి), ఫారం-7 (పేరు చేర్చడానికి లేదా ఓటర్ల జాబితా నుండి పేరును తొలగించడానికి అభ్యంతరం దాఖలు చేయడానికి) లేదా ఫారం-8 (పేరు, చిరునామా మొదలైన వాటిలో దిద్దుబాట్ల కోసం) దాఖలు చేయవచ్చు.
మరింత సమాచారం కోసం, ఓటర్లు యూసుఫ్‌గూడలోని సర్కిల్ నంబర్ 19లోని GHMC డిప్యూటీ కమిషనర్ అయిన ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌ను సంప్రదించవచ్చు. వారి సంబంధిత బూత్ లెవల్ అధికారులను కూడా సంప్రదించవచ్చు లేదా టోల్-ఫ్రీ నంబర్ 1950కి కాల్ చేయవచ్చు.
జూబ్లీహిల్స్‌కు జరుగుతోంది ఉపఎన్నిక అయినా.. ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నికపై ఆసక్తి నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఆశించినన్ని సీట్లు దక్కకపోవడంతో.. ఈ ఉపఎన్నికతో నగరంలో తన ఉనికి చాటుకోవాలని చూస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును కాపాడుకోవాడానికి వ్యూహాలు రచిస్తోంది. ఇక తుది జాబితా విడుదల కావడంతో త్వరలోనే ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఈ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే.