వాషింగ్టన్ డీసీ: అమెరికా సేనేట్‌లో రిపబ్లికన్లు ప్రవేశపెట్టిన ఫెడరల్ నిధులకు చెందిన బిల్లుకు ఆమోదం దక్కకపోవడంతో అగ్రరాజ్యం ఆరేళ్ల తరువాత తొలిసారి షట్‌డౌన్‌లోకి వెళ్లింది. ఫండింగ్ బిల్లులకు సంబంధించి డెమొక్రాట్లు డొనాల్డ్ ట్రంప్‌తో మాటల యుద్ధం చేయడంతో…ప్రభుత్వ ఖర్చులకు నిధులు సమకూర్చే బిల్లును సెనేట్ ఆమోదించడంలో విఫలమైంది. తత్ఫలితంగా, అనేక US ప్రభుత్వ కార్యాలయాలలో అర్ధరాత్రి నుండి, అంటే భారత కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం 9:30 నుండి పనులు నిలిపివేశారు. బిల్లును ఆమోదించడానికి సెనేట్‌కు 60 ఓట్లు అవసరం, కానీ 55 మాత్రమే వచ్చాయి. దీంతో ప్రభుత్వ ప్రతిపాదన వీగిపోయింది.
మరోవైపు అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ… రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య చర్చలు నిలిచిపోయినందుకు డెమొక్రాట్లను నిందించాడు. దీనికి ఆ పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, ఓటర్లు శిక్షిస్తారని బెదిరించాడు. షట్ డౌన్ జరిగితే”చాలా మంది” ఫెడరల్ ఉద్యోగులను తొలగిస్తానని బహిరంగంగా హెచ్చరించారు.
శ్వేతసౌధంలో జరిగిన భేటీ తర్వాత సెనేట్ డెమొక్రాటిక్ నాయకుడు చక్ షుమెర్ మాట్లాడుతూ… రిపబ్లికన్లు డెమొక్రాట్లను బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. “రిపబ్లికన్లు అమెరికాను షట్‌డౌన్‌లోకి నెట్టారు. లక్షలాది అమెరికన్ కుటుంబాలు ఇప్పుడు తమ బిల్లులు ఎలా చెల్లించాలో ఆలోచిస్తూ కూర్చుంటారు” అని అన్నారు. రాబోయే రోజుల్లో దీనికి రిపబ్లికన్లను ప్రజలు బాధ్యులుగా భావిస్తారని ఆయన హెచ్చరించారు.
కాగా, కాంగ్రెస్‌లోని రెండు సభలలో మైనారిటీలో ఉన్న డెమొక్రాట్లు, ట్రంప్ రెండవసారి అధ్యక్ష పదవి చేపట్టాక ఎనిమిది నెలలుగా ఫెడరల్ ప్రభుత్వంపై అరుదైన పరపతిని ఉపయోగించాలని ప్రయత్నిస్తున్నారు, కాగా, షట్‌డౌన్ మొత్తం అమెరికా ప్రభుత్వ సంస్థలను కూల్చివేసింది. షట్‌డౌన్ కారణంగా మిలటరీ దళాలు వంటి అత్యవసర ఉద్యోగులు జీతాలు లేకుండా పనిచేయాల్సి ఉంటుంది. ఆహార భద్రతా, విమాన ప్రయాణ నియంత్రణ, ఫెడరల్ కోర్టులు, ఇతర ముఖ్యమైన సేవలు ప్రభావితమవుతాయి. 1980 నుండి USలో 14 సార్లు షట్డౌన్లు జరిగాయి. 2018-19లో ట్రంప్ పదవీకాలంలో 35 రోజుల పాటు కొనసాగిన అత్యంత ఎక్కువకాలం షట్‌డౌన్ విధించారు.