న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జరిగిన నేరాల వార్షిక నివేదిక వివరాలను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా విడుదల చేసింది. ఇందులో భాగంగా మణిపూర్‌లో చోటుచేసుకున్న హింసపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. 2023 NCRB నివేదిక ప్రకారం… జాతి సంఘర్షణ నేపధ్యంలో షెడ్యూల్డ్ కులాలపై హింసలో పెరుగుదల కనిపించిందని లెక్కలు తేల్చాయి. ఈమేరకు మొత్తం 14,427 నేరాలు జరిగినట్టు ఎన్సీఆర్బీ పేర్కొంది.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ప్రచురించిన తాజా నివేదిక ప్రకారం… మణిపూర్‌లో కేవలం ఒక సంవత్సరం వ్యవధిలో నమోదైన హింసాత్మక నేరాల గణాంకాలు చూస్తుంటే దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. 2023 మే లో మణిపూర్‌లో చెలరేగిన జాతి హింస కారణంగా, షెడ్యూల్డ్ కులాల సమాజంపై రాష్ట్రంలో అత్యధిక నేరాలు నమోదయ్యాయని నివేదిక వివరిస్తుంది. మైటీలు, కుకీల మధ్య వివాదం ప్రారంభమైన తర్వాత అదే సంవత్సరంలో 2023లో 14,427 నేరాలు నమోదయ్యాయని దిగ్భ్రాంతికరమైన నివేదిక వెల్లడించింది.
మణిపూర్‌లో 5,421 అల్లర్ల కేసులు, 6,203 దహనం, 330 దోపిడీలు, 1,213 దోపిడీ కేసులు నమోదయ్యాయి. జాతి ఘర్షణల కారణంగా చెలరేగిన హింసలో, 260 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందల మంది నిర్వాసితులయ్యారు. వేలాదిమంది తాత్కాలిక శిబిరాల్లో నివసించాల్సి వచ్చింది. మణిపూర్‌లో పరిస్థితిని “ఆందోళనకరంగా” ఉందని NCRB వర్ణించింది. దీనిపై హక్కుల సంఘాలు, విశ్లేషకులు “తక్షణమే దృష్టి పెట్టాలి” అని కూడా పేర్కొంది.
అంతేకాదు NCRB నివేదిక ప్రకారం మణిపూర్‌లో 151 హత్యలు, 818 హత్యాయత్నాలు, 89 కిడ్నాప్‌లు, రెండు అత్యాచారాలు జరిగాయని కూడా వెల్లడించింది.
అదేసమయంలో అత్యధిక నేరాలు నమోదైన రెండవ రాష్ట్రం అస్సాం అని ఎన్సీఆర్బీ లెక్కలు చెబుతున్నాయి. షెడ్యూల్డ్ కులాలపై మొత్తం 3,339 కేసులు నమోదయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా ఇక సైబర్ నేరాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది.