న్యూఢిల్లీ: తన భర్తను బేషరతుగా విడుదల చేయాలని పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ భార్య రాష్ట్రపతికి లేఖ రాసారు. వాంగ్‌చుక్‌ను ఎలాంటి కారణం లేకుండా నిర్బంధించారని, తన భర్తతో ఫోన్‌లో లేదా వ్యక్తిగతంగా మాట్లాడటానికి అనుమతించలేదని ఆమె తన మూడు పేజీల లేఖలో ప్రస్తావించారు. నా భర్తను అక్రమంగా నిర్బంధించడమే కాకుండా, రాష్ట్రంతో పాటు దర్యాప్తు సంస్థలూ మమ్మల్ని వేధిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. తమపై నిఘా ఉంచిన విధానం చాలా దారుణం. ఈ చర్య భారత రాజ్యాంగ స్ఫూర్తి, నైతికతను ఉల్లంఘిస్తోందని ఆంగ్మో రాష్ట్రపతికి రాసిన లేఖలో తెలిపారు.
గత నాలుగేళ్లుగా వాంగ్‌చుక్‌పై అనేక కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. వాతావరణ మార్పులు, కరగుతున్న హిమానీనదాలు, విద్యా సంస్కరణల గురించి మాట్లాడటం నేరమా? అని ఆమె ప్రశ్నించారు. లడఖ్ ప్రజల హక్కుల కోసం పోరాడటం పాపమా? వీటిపై ఆయన గాంధేయ పద్ధతిలో శాంతియుతంగానే నిరసన తెలియజేస్తున్నారు. వెనుకబడిన గిరిజనుల అభ్యున్నతి కోసం పోరాడుతున్నారు. దీనివల్ల జాతీయ భద్రతకు ఏంటి ముప్పు? మీది కూడా గిరిజన నేపథ్యమే కాబట్టి నా బాధను అర్థం చేసుకోండి. వాంగ్‌చుక్ అరెస్ట్ పై జోక్యం చేసుకుని, మీ అధికారాలతో ఆయనను బేషరతుగా విడిపించండి” అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో గీతాంజలి పేర్కొన్నారు.
అంతేకాదు ప్రధానమంత్రి కార్యాలయం, హౌం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ , లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి కూడా రాష్ట్రపతికి రాసిన లేఖ కాపీలను ఆమె పంపారు.
కాగా, లడఖ్‌కు రాష్ట్ర హోదా, ఆ ప్రాంతాన్ని రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో చేర్చడం వంటి డిమాండ్లకు మద్దతుగా జరిగిన నిరసనల సందర్భంగా లేహ్ పట్టణంలో హింస చెలరేగింది. ఈ ఘర్షణలు నలుగురు మరణించగా, అనేక మంది గాయపడిన రెండు రోజుల తర్వాత, సెప్టెంబర్ 26న వాంగ్‌చుక్‌ను జాతీయ భద్రతా చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు.