న్యూఢిల్లీ: కుటుంబ చట్టాలు, సామాజిక స్థితిగతులు, వ్యక్తుల ఆర్థిక స్థితిగతుల అంశాలకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన కేసు ఒకటి ఇటీవల కోర్టు ముందుకొచ్చింది. పవిత్ర ఖురాన్ ఏకపత్నీవ్రతాన్ని ప్రోత్సహిస్తుందని, బహుభార్యత్వం ఒక మినహాయింపు మాత్రమే అని కోర్టు పేర్కొంది. అయితే భార్యలందరికి న్యాయం చేస్తానంటేనే ముస్లిం పురుషుడు ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను వివాహం చేసుకోవడానికి అనుమతి ఉందని కూడా కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది.
“పవిత్ర ఖురాన్ న్యాయాన్ని బాగా నొక్కి చెబుతుంది. ఒక ముస్లిం పురుషుడు తన మొదటి భార్య, రెండవ భార్య, మూడవ భార్య,నాల్గవ భార్యకు న్యాయం చేయగలిగితే, ఒకటి కంటే ఎక్కువ వివాహాలకు అనుమతి ఉందని కేరళ హైకోర్టు న్యాయమూర్తి పి.వి. కున్హికృష్ణన్ ఇటీవలి తీర్పులో అన్నారు. బహుభార్యత్వం ముస్లిం పురుషులకు అనుమతి ఉందనేది అపోహ అని న్యాయమూర్తి అన్నారు.
కేరళలోని మలప్పురం జిల్లాలోని పొన్నియకురుస్సికి చెందిన ఒక ముస్లిం మహిళ తన భర్త నుండి భరణం కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. 46 ఏళ్ల భర్త ఒక అంధుడు, అతను తన పొరుగువారి నుండి వచ్చే డబ్బులతో, మసీదు ముందు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ముస్లిం పర్సనల్ లా బహుభార్యత్వాన్ని న్యాయంగా, సమానంగా పోషించగల పురుషులకు మాత్రమే అనుమతిస్తుందని కోర్టు పేర్కొంది.
కుటుంబ న్యాయస్థానం ఆ మహిళ భరణం కోసం చేసిన దరఖాస్తును తోసిపుచ్చింది, దీనితో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. పిటిషనర్ అంధుడికి రెండవ భార్య, అతను తన మొదటి భార్యతో నివసిస్తున్నాడు. భర్త తలాక్ చెప్పడం ద్వారా తనను విడాకులు తీసుకుంటానని బెదిరిస్తున్నాడని పిటిషనర్ పేర్కొంది. అతను మూడవసారి కూడా వివాహం చేసుకుంటానని బెదిరిస్తున్నాడని ఆమె పేర్కొంది. భర్త తనను దుర్భాషలాడుతున్నాడని కూడా ఆమె ఆరోపించింది.
జీవనోపాధి కోసం అడుక్కునే వ్యక్తి తన భార్యకు భరణం చెల్లించమని బలవంతం చేయలేమని గుర్తించిన కుటుంబ న్యాయస్థానం ఆమె భరణం కోసం చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. భార్య అప్పీల్‌ను పరిగణనలోకి తీసుకుంటూ, హైకోర్టు కుటుంబ న్యాయస్థానం నిర్ణయంతో ఏకీభవించింది. అయితే, ఒంటరి భార్యను కూడా పోషించడానికి వనరులు లేనందున ఆ వ్యక్తికి ఇకపై వివాహం చేసుకోవద్దని సలహా ఇవ్వాలని అభిప్రాయపడింది.
ఒకరి కన్నా ఎక్కువ భార్యలను పోషించుకోలేని ముస్లిం పురుషులు బహుభార్యత్వంలో పాల్గొనకుండా ఉండమని సలహా ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని కోర్టు అభిప్రాయపడింది. బహుభార్యత్వ బాధితులైన మహిళలను ప్రభుత్వాలు రక్షించాలని కోర్టు పేర్కొంది.
“ముస్లిం సమాజానికి చెందిన, మసీదు ముందు భిక్షాటన చేస్తున్న అంధుడు ముస్లిం ఆచార చట్టం ప్రాథమిక సూత్రాల గురించి కూడా తెలియకుండా ఒకరి తర్వాత ఒకరు వివాహం చేసుకుంటే, అతనికి తగిన విధంగా సలహా ఇవ్వడం ప్రభుత్వం విధి. అటువంటి వ్యక్తికి రాష్ట్ర అధికారులు తగిన కౌన్సెలింగ్ ఇవ్వాలి. ముస్లిం సమాజంలో బహుభార్యత్వ బాధితులైన నిరుపేద భార్యలను రక్షించడం రాష్ట్ర విధి” అని కోర్టు తన తీర్పులో పేర్కొంది.
ముస్లిం సమాజంలోని మెజారిటీ ప్రజలు ఏకపత్నీవ్రతాన్ని అనుసరిస్తున్నారు, వారికి ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను పోషించే స్థోమత ఉన్నప్పటికీ, అది పవిత్ర ఖురాన్ నిజమైన స్ఫూర్తి అని కూడా కోర్టు పేర్కొంది. “పవిత్ర ఖురాన్ ఆయత్‌లను మరచిపోయి బహుభార్యత్వాన్ని అనుసరిస్తున్న చిన్న మైనారిటీ వర్గాలకు మత నాయకులు, సమాజం ద్వారా అవగాహన కల్పించాలని” కోర్టు పేర్కొంది.
కేరళలో భిక్షాటనకు గుర్తింపు లేదని కోర్టు పేర్కొంది. “జీవనోపాధి కోసం ఎవరూ భిక్షాటన చేయకుండా చూసుకోవడం రాష్ట్రం, సమాజం, కోర్టుల విధి. అలాంటి వ్యక్తికి కనీసం ఆహారం, దుస్తులు అందించడం రాష్ట్ర బాధ్యత. అటువంటి వ్యక్తి నిరుపేద భార్యను తగు చర్యల ద్వారా రాష్ట్రం కూడా ఆదుకోవాలని” కోర్టు తీర్పు ఇచ్చింది.
“ముస్లిం పురుషుడు తన భార్యలను పోషించుకునే సామర్థ్యం లేనప్పుడు అతని మొదటి, రెండవ లేదా మూడవ వివాహాన్ని న్యాయస్థానం గుర్తించదు. భార్యలలో ఒకరు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 కింద భరణం కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఈ రకమైన వ్యక్తులకు సరైన కౌన్సెలింగ్ అవసరం” అని కోర్టు పేర్కొంది.
“ప్రతివాది రెండవ భార్య అయిన పిటిషనర్, అతని మొదటి భార్య దుస్థితిని కూడా ఈ కోర్టు పరిగణనలోకి తీసుకోవాలి. ముస్లిం చట్టాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ప్రతివాది [భర్త] పిటిషనర్‌ను వివాహం చేసుకున్నాడు, బహుశా ముస్లిం చట్టం తప్పుదారి పట్టడం వల్ల కావచ్చు” అని కోర్టు వివరించింది.
చట్టం ప్రకారం తగిన చర్య తీసుకోవడానికి కేరళ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శికి ఈ ఉత్తర్వును పంపాలని కోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. “సాధ్యమైతే, రాష్ట్ర ప్రభుత్వం పిటిషనర్,ప్రతివాదిని తిరిగి కలపాలి, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఒక ఈకలా ఉంటుంది” అని కోర్టు పేర్కొంది.
ఈ సందర్భంగా కోర్టు… సురా అన్-నిసా (అధ్యాయం IV) లోని 3, 129 వచనాలను విస్తృతంగా ఉదహరించింది. ఈ ఆయత్‌ల ఉద్దేశ్యం ఏకపత్నీవ్రత అని తేల్చి చెబుతుంది. బహుభార్యత్వం కేవలం ఒక మినహాయింపు మాత్రమే” అని కోర్టు పేర్కొంది.