న్యూఢిల్లీ: భారతదేశంలో ప్రస్తుతం “ప్రజాస్వామ్య వ్యవస్థపై ముప్పేట దాడి” జరుగుతోందని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు ఇదేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొలంబియాలోని ఎన్విగాడోలో ఉన్న ఈఐఏ యూనివర్సిటీలో విద్యార్థులతో జరిగిన ఒక ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
“చైనా చేసేది మనం చేయలేము, అంటే ప్రజలను అణచివేసి నిరంకుశ వ్యవస్థను నడపలేం” అని అన్నారు. మా డిజైన్ దానిని అంగీకరించదు” అని ఆయన నొక్కి చెప్పారు. ఎందుకంటే విభిన్న సంప్రదాయాలు వృద్ధి చెందడానికి దేశానికి విశాల దృక్ఫథం ముఖ్యమని అన్నారు.
కొలంబియా దేశం మెడెల్లిన్‌లోని EIA విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ… చైనాతో పోలిస్తే భారతదేశం చాలా సంక్లిష్టమైన వ్యవస్థను కలిగి ఉందని, భారతదేశం బలాలు పొరుగు దేశం కంటే చాలా భిన్నంగా ఉన్నాయని గాంధీ అన్నారు.
భారతదేశం అసలైన బలం దాని భిన్నత్వంలోనే ఉందని రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నో మతాలు, భాషలు, సంప్రదాయాలు ఉన్న మన దేశంలో అన్ని వర్గాల వాణిని వినిపించే సత్తా కేవలం ప్రజాస్వామ్య వ్యవస్థకు మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. కానీ, ప్రస్తుతం అదే వ్యవస్థ ప్రమాదంలో పడిందని ఆరోపించారు. “భారతదేశం అంటే ప్రజల మధ్య జరిగే ఒక సంభాషణ. విభిన్న సంప్రదాయాలు, ఆలోచనలు వికసించాలంటే ప్రజాస్వామ్య చట్రం అత్యవసరం” అని ఆయన వివరించారు.
“నేను భారతదేశం గురించి చాలా ఆశావాదంగా ఉన్నాను. “భారతదేశంలో బహుళ మతాలు, సంప్రదాయాలు, భాషలు ఉన్నాయి. విభిన్న ఆలోచనలు, మతాలు, సంప్రదాయాలకు కొంత స్పేస్ అవసరం. దాన్ని సృష్టించడానికి ఉత్తమ పద్ధతి ప్రజాస్వామ్య వ్యవస్థ” అని ఆయన అన్నారు.
దక్షిణ అమెరికా దేశాన్ని సందర్శించిన సందర్భంగా, రాహుల్ గాంధీ కొలంబియా అధ్యక్షుడు, సెనేట్ లిడియో గ్రేసియాను కూడా కలిశారు. కాగా, కాంగ్రెస్ నాయకుడు దక్షిణ అమెరికాలో నాలుగు దేశాల పర్యటనలో ఉన్నారు.