హైదరాబాద్: హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ సమీపంలోని కొండాపూర్‌లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన తాత్కాలిక షెడ్ల కూల్చివేతను హైడ్రా బృందాలు చేపట్టాయి. దీంతో ఆ ప్రాంతంలో ఈ ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల సహాయంతో హైడ్రా బృందాలు హైదరాబాద్‌లో ఉద్రిక్త వాతావరణంలో కూల్చివేత కార్యక్రమాన్ని కొనసాగించాయి. కొండాపూర్ RTA కార్యాలయానికి దగ్గరగా ఉన్న ప్రదేశానికి వెళ్లే రహదారిపై పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు.
ఈ భూమిని కొంతమంది కబ్జా చేశారు. ఈ విషయమై హైకోర్టు తీర్పు మేరకు హైడ్రా ఆక్రమణల తొలగింపును చేపట్టింది. తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేసి వ్యాపారం చేసుకుంటున్న వారిని ఖాళీ చేయించింది. చుట్టూ కంచె వేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది. సర్వే నంబర్ 59లోని ఈ భూముల విలువ రూ.3,600 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. మరోవైపు 60 ఏళ్లుగా తమ అధీనంలో భూములున్నాయని రైతులు చెబుతున్నారు.
కాగా, హైదరాబాద్‌లో గత కొన్నేళ్లుగా అక్రమ నిర్మాణాలు భారీస్థాయిలో చేపట్టారు యథేచ్ఛగా అక్రమార్కులు నిబంధనలని ఉల్లంఘిస్తున్నారు. అక్రమ నిర్మాణాలతో పలు ప్రాంతాలు వర్షాకాలంలో వరదలకు గురవుతున్నాయి. ఈ సమస్యపై హైడ్రా ఫిర్యాదులు వస్తోండటంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేసే చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా గత నెలలో గాజులరామారంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. దాదాపు 300 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులనుంచి విముక్తి కల్పించారు.