న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్,రాజస్థాన్‌లలో పిల్లల మరణాలకు కారణమైన దగ్గు సిరప్‌లో విషపూరితం కాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. అయితే ఈ విషాదం వెనుక కారణాన్ని గుర్తించడానికి దర్యాప్తులు కొనసాగుతున్నాయని పేర్కొంది.
అధికారిక దర్యాప్తు బృందం సేకరించిన ఔషధ నమూనాలను మూత్రపిండాల గాయాలకు కారణమయ్యే డైథిలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ (DEG-EG) లేనట్లు తేలిందని కేంద్రం తెలిపింది.
“పరీక్ష ఫలితాల ప్రకారం, ఏ నమూనాలోనూ DEG లేదా EG లేదు. మధ్యప్రదేశ్ రాష్ట్ర ఆహార, ఔషధ సంస్థ కూడా మూడు నమూనాలను పరీక్షించింది. DEG/EG లేకపోవడాన్ని నిర్ధారించింది” అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
ఈమేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలోని ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ శుక్రవారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు దగ్గు సిరప్‌ల హేతుబద్ధమైన వాడకంపై ఒక సలహా జారీ చేశారు. రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో వాటిని ఖచ్చితంగా ఉపయోగించకూడదని సలహా ఇచ్చారు. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు కూడా వీటిని సాధారణంగా సిఫార్సు చేయరు.
సెప్టెంబర్‌లో మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఏడుగురు పిల్లలు, రాజస్థాన్‌లోని సికార్, భరత్‌పూర్ జిల్లాలో మరో ఇద్దరు మరణించిన తర్వాత కేంద్రం ఈ ఆదేశాలు ఇచ్చింది.
పిల్లవాడికి ఇచ్చే రెండు సాధారణ దగ్గు సిరప్‌లలో కలుషితం ఉందని అనుమానిస్తూ, చింద్వారా జిల్లా యంత్రాంగం జిల్లా అంతటా మందుల అమ్మకాలను నిషేధించింది. ఈమేరకు తల్లిదండ్రులు, వైద్యులు, మందుల దుకాణాలకు వాటిని వాడొద్దని సలహా ఇచ్చింది.
నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఢిల్లీ: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పూణే, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నాగ్‌పూర్ నుండి నిపుణులతో కూడిన ఉమ్మడి బృందాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పంపింది. వివిధ దగ్గు సిరప్‌ల నమూనాలతో సహా రాష్ట్ర అధికారులతో సమన్వయంతో బహుళ నమూనాలను సేకరించారు.
“విషపూరిత కలుషితాలు లేవని తోసిపుచ్చినప్పటికీ, సాధారణ వ్యాధికారకాల కోసం NIV పూణే మరిన్ని పరీక్షలు నిర్వహిస్తోంది. ఒక కేసు లెప్టోస్పిరోసిస్‌కు పాజిటివ్‌గా తేలింది. నీటి నమూనాలు, కీటక శాస్త్ర వాహకాలు, శ్వాసకోశ నమూనాలను NEERI, NIV, ఇతర ప్రయోగశాలలు మరింత దర్యాప్తు చేస్తాయని” అధికారి తెలిపారు.
రాజస్థాన్‌లో కలుషితమైన దగ్గు సిరప్ వినియోగం వల్ల సంభవించినట్లు అనుమానించిన రెండు మరణాల్లోనూ దగ్గు సిరప్‌లో DEG/EG కారకాలు లేవని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, జన్ స్వాస్థ్య అభియాన్ (ప్రజారోగ్య ఉద్యమం) ఆరోగ్య కార్యకర్తలు రాజస్థాన్ ఆరోగ్య మంత్రి గజేంద్ర సింగ్ ఖిమ్సర్‌ను “దగ్గు సిరప్ తయారీ, నాణ్యత పరీక్ష లేదా పంపిణీలో లోపాలు సహా ఈ సంఘటనకు గల కారణాలను గుర్తించడానికి తక్షణమే నిష్పాక్షిక దర్యాప్తు నిర్వహించడానికి” ఒక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు.
“ప్రజారోగ్య సౌకర్యాలలో ఉచితంగా అందించే మందులు సురక్షితమైనవి, నమ్మదగినవి అని ప్రజలను ఒప్పించడానికి చాలా సంవత్సరాలుగా కృషి జరిగింది, కానీ మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి సంఘటనలు ఆ కష్టపడి సాధించిన ప్రయోజనాలను నీరుగార్చే ప్రమాదం ఉంది” అని మంత్రికి ఇచ్చిన మెమోరాండంలో JSA పేర్కొంది.
