న్యూఢిల్లీ: కీలకమైన బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్కడ నిర్వహించిన ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల బ్యాచ్‌కు సంబంధించి భారత సుప్రీంకోర్టు నేడు తుది వాదనలు విననుంది.
అక్టోబర్ 1న సవరించిన ఓటర్ల జాబితా తుది ప్రచురణ తర్వాత మాత్రమే ఈ విషయాన్ని చేపట్టాలని వాదించిన భారత ఎన్నికల సంఘం (ECI) అభ్యర్థన మేరకు జస్టిస్ సూర్యకాంత్, జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం గతంలో విచారణను వాయిదా వేసింది.
ECI ఇప్పుడు SIR ప్రక్రియను పూర్తి చేసింది, తుది ఓటర్ల జాబితాలో మొత్తం 7.43 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈమేరకు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR), ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లు SIR ప్రక్రియ చట్టబద్ధత, పారదర్శకత గురించి ఆందోళనలను లేవనెత్తాయి. ADR తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, తుది జాబితా ప్రచురించటానికి ముందే ఈ విషయాన్ని విచారించాలని కోర్టును కోరారు. ఓటర్ల హక్కుల ఉల్లంఘన, విధానపరమైన లోపాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే, తుది జాబితా ప్రచురణ న్యాయ సమీక్షను నిరోధించదని, ప్రచురణ తర్వాత కూడా ఏదైనా చట్టవిరుద్ధంగా ఉంటే జోక్యం చేసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది.
SIR సమయంలో ధృవీకరణ ప్రక్రియ కోసం ఆధార్‌ను చెల్లుబాటు అయ్యే పత్రంగా అంగీకరించాలని కోర్టు గతంలో ECIని ఆదేశించింది. అయితే, సమర్పించిన అన్ని పత్రాలు నిజమైనవి, సరిగ్గా పరిశీలించినవి అని ECI నిర్ధారించుకోవాలని బెంచ్ నొక్కి చెప్పింది.
ఏదైనా మధ్యంతర ఆదేశాలను జారీ చేయడానికి నిరాకరించిన బెంచ్, తుది విచారణ వరకు సమగ్ర తీర్పును రిజర్వ్ చేసింది. “మేము మొత్తం కసరత్తును పూర్తిగా పరిశీలిస్తాము” అని జస్టిస్ సూర్య కాంత్ గత సెషన్‌లో వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 6 – 11 తేదీల్లో రెండు దశల్లో జరుగుతాయని, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఈసీఐ ప్రకటించింది. విలేకరుల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాబోయే బీహార్ ఎన్నికలను “మదర్ ఆఫ్ ఆల్ ఎలక్షన్”గా అభివర్ణించారు, శాంతియుతంగా, పారదర్శకంగా ఓటింగ్ జరిగేలా విస్తృత సన్నాహాలు చేసినట్లు తెలిపారు.
“బీహార్ ఓటర్లకు ఎన్నికలు సజావుగా, న్యాయంగా మాత్రమే కాకుండా, ఇప్పటివరకు అత్యంత ప్రశాంతంగా, శాంతియుతంగా జరుగుతాయని, శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మేము హామీ ఇవ్వాలనుకుంటున్నాము” అని కుమార్ అన్నారు, సహ ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి కూడా దీనికి మద్దతు ఇచ్చారు.
ఈ సంవత్సరం ఎన్నికలు రాష్ట్ర ఓటర్ల జాబితా SIR-కసరత్తు తర్వాత బీహార్‌లో జరుగుతున్న మొదటి ప్రధాన ఎన్నికలు కావడం గమనార్హం.