బెంగళూరు: కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. సెలవుల్లో సరదాగా గడపాల్సిన విహారయాత్ర కాస్తా విషాదకరమైంది. మార్కోనహళ్లి ఆనకట్ట దిగువన పిక్నిక్కు వెళ్లిన ఏడుగురు వ్యక్తులు నీటి ప్రభావం ధాటికి కొట్టుకుపోయారు. ఇప్పటివరకు రెండు మృతదేహాలను వెలికి తీసారు. ఒక్కరిని రక్షించారు.
తుమకూరు పోలీసు సూపరింటెండెంట్ అశోక్ వెల్లడించిన సమాచారం ప్రకారం…తుముకూరు నుండి దాదాపు 15 మంది పిక్నిక్ కోసం ఆనకట్ట దగ్గరికి వెళ్లారు. సైఫన్ వ్యవస్థ అకస్మాత్తుగా నీటిని విడుదల చేయడంతో మహిళలు, పిల్లలు సహా ఏడుగురు శక్తివంతమైన నీటి ప్రవాహం దెబ్బకు కొట్టుకుపోయారు.
సమాచారం తెలుసుకున్న పోలీసు, అగ్నిమాపక విభాగాల నుండి రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. నవాజ్ అనే వ్యక్తిని రక్షించి ఆదిచుంచనగిరి ఆసుపత్రిలో చేర్చారు. నవాజ్ తప్ప మిగతా బాధితులందరూ మహిళలు, బాలికలే అని ఎస్పీ అశోక్ చెప్పారు
ఇద్దరి మృతదేహాలను వెలికితీశామని, తప్పిపోయిన మిగతావారిని కనుగొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. చీకటి పడడంతో వెలికితీత కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేసి ఈరోజు ఉదయం తిరిగి ప్రారంభించారు.
కాగా, ఆనకట్ట ఇంజనీర్ల ప్రకారం… నీటి ప్రవాహం అకస్మాత్తుగా పెరగడంతో ఈ సంఘటన సంభవించింది, అయితే సైఫన్ విడుదల వెనుక ఖచ్చితమైన కారణాన్ని పరిశీలించనున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆదిచుంచనగిరి ఆసుపత్రిలో ఉంచారు.