చండీగడ్: హర్యానా ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ మరణానికి సంబంధించి పోలీస్ ఉన్నతాధికారులు శత్రుజీత్ సింగ్ కపూర్, రోహ్‌తక్ ఎస్‌పీ నరేంద్ర బిజార్నియాలపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అంతేకాదు ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసారు.
కాగా, 2001 బ్యాచ్ అధికారి పూరన్ కుమార్ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎనిమిది పేజీల సూసైడ్ నోట్‌లో, సీనియర్ అధికారులు తనను “మానసిక వేధింపులకు” గురిచేస్తున్నారని ఆరోపించారు. ఆ అధికారి తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నారని, అతని మృతదేహాన్ని అతని కుమార్తె బేస్‌మెంట్‌లో కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు.
ఆ అధికారి భార్య, సీనియర్ ఐఏఎస్ అధికారిణి అమ్నీత్ కుమార్ బుధవారం దీనిపై చండీగఢ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 8 పేజీల ఆత్మహత్యా పత్రంలో పూరన్ పేర్కొన్నట్టుగా ఉన్నతస్థాయి అధికారుల క్రమబద్ధమైన హింసకు ఇది ఫలితమని పేర్కొన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రికి రాసిన లేఖలో అమ్నీత్ పలు విషయాలు వెల్లడించారు. “కులవివక్ష, ఉన్నతాధికారుల వేధింపుల వల్లే పూరన్ ఆత్మహత్య చేసుకున్నారు. హరియాణా పోలీసు విభాగానికి చెందిన ఉన్నతాధికారులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు” అని రాష్ట్ర ముఖ్యమంత్రి నాయబ్ సైనీకి ఆమె ఫిర్యాదు చేశారు.
కాగా, భర్త ఆత్మహత్య చేసుకున్న సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రితో కలిసి అధికారిక పర్యటనలో భాగంగా జపాన్‌లో ఉన్న అమ్నీత్ వెంటనే వెనక్కు వచ్చారు.
ఈ దుర్ఘటనపై లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ…హర్యానా ఐపీఎస్ అధికారి ‘ఆత్మహత్య’ “తీవ్రతరం అవుతున్న సామాజిక విషానికి” ప్రతీక అని అన్నారు. తన కులం కారణంగా ఆ ఐపీఎస్ అధికారి “అవమానం, అణచివేతను భరించాల్సి వచ్చింది” అని ఆయన పేర్కొన్నారు.
“ఒక ఐపీఎస్ అధికారి తన కులం కారణంగా అవమానం, అణచివేతను భరించాల్సి వచ్చినప్పుడు – ఒక సాధారణ దళిత పౌరుడు ఎలా జీవిస్తాడో ఊహించుకోండి” అని రాహుల్ గాంధీ అన్నారు.