మనీలా: ఫిలిప్పీన్స్‌లో ఈ ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో ప్రజల్ని భయపెట్టింది. ఆఫ్‌షోర్ భూకంపం మిండనావోలోని దావో ఓరియంటల్‌లోని మనాయ్ పట్టణంలో 10 కి.మీ లోతులో సంభవించిందని తెలిపింది. ఈ శక్తివంతమైన భూకంపం కారణంగా తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.
హవాయికి చెందిన పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం ఫిలిప్పీన్స్‌లో సునామీ ముప్పు దాటిపోయిందని తెలిపింది. అయితే, ఇతర సంస్థల నుండి హెచ్చరికలు అలానే ఉన్నాయి. మధ్య, దక్షిణ ఫిలిప్పీన్స్ తీరప్రాంతాల వారు ముందుజాగ్రత్తగా ఎత్తైన ప్రాంతాలకు లేదా లోతట్టు ప్రాంతాలకు వెళ్లాలని కోరారు.
ప్రాణనష్టంపై సమాచారం లేదు
భూకంపం తర్వాత, భూకంప కేంద్రం నుండి 186 మైళ్ల దూరంలో ప్రమాదకరమైన అలలు సంభవించవచ్చని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఫిలిప్పీన్స్ తీరంలోని కొన్ని ప్రాంతాలలో 3 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉందని, ఇండోనేషియా, పలావులలో చిన్న అలలు ఎగసిపడే అవకాశం ఉందని అంచనా.
భూకంపం సంభవించినప్పుడు ప్రజలు భయాందోళనకు గురయ్యారని దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రావిన్స్ దావావో ఓరియంటల్ గవర్నర్ తెలిపారు. “కొన్ని భవనాలు దెబ్బతిన్నాయని ఎడ్విన్ జుబాహిబ్ స్థానిక మీడియాకు చెప్పినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ ఉటంకించింది. “ఇది చాలా బలంగా ఉంది.”
మరోవంక భూకంపం సంభవించినప్పుడు ప్రజలలో భయం, భయాందోళనలను చూపించే వీడియోలు సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నాయి. టాగమ్ సిటీ దావావో ఆసుపత్రి నుండి వచ్చిన వీడియోలో రోగులు, సిబ్బంది ప్రకంపనల మధ్య తమ ప్రాణాలను రక్షించుకునేందుకు పరిగెడుతున్నట్లు చూపించింది.
చేపల పెంపకం దుకాణం వద్ద తీసిన మరొక ఫుటేజ్‌లో గాజు పాత్రలు, బకెట్లలో నీరు తీవ్రంగా వణుకుతున్నట్లు చూపించారు. ముందు జాగ్రత్త చర్యగా, ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి మరియు పాపువా ప్రాంతాలకు సునామీ హెచ్చరిక జారీ చేశారు. దేశ తీరప్రాంతాల్లో 50 సెం.మీ.ల ఎత్తులో అలలు ఎగసిపడతాయని హెచ్చరించింది.
ఈ దశాబ్దంలో అత్యంత ఘోరమైన భూకంపాన్ని చూసిన రెండు వారాల తర్వాత ఫిలిప్పీన్స్‌లో నేడు శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఫిలిప్పీన్స్ కాలమానం ప్రకారం ఉదయం 9:43 గంటలకు ఈ భూకంపం సంభవించినట్లు ఆ దేశ వోల్కనాలజీ అండ్ సీస్మాలజీ ఇన్స్టిట్యూట్ అధికారికంగా ప్రకటించింది. పసిఫిక్ మహాసముద్రంలోని “రింగ్ ఆఫ్ ఫైర్” ప్రాంతంలో ఫిలిప్పీన్స్ ఉండటం వల్ల ఇక్కడ తరచూ భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనాలు సంభవిస్తుంటాయి.