ముంబై: మహారాష్ట్రలో పెను విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు. ఈరోజు ఉదయం బారామతి విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో ఆయన ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు విమానంలో ఉన్న మరో నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇద్దరు అజిత్ పవార్ వ్యక్తిగత సిబ్బంది కాగా, మరో ఇద్దరు పైలెట్లు ఉన్నారని డీజీసీఏ అధికారికంగా ప్రకటించింది.
ఘటనా స్థలం నుండి వచ్చిన దృశ్యాలలో విమాన శకలాలు మంటల్లో చిక్కుకుని కనిపించాయి. ప్రమాద స్థలంలో ప్రజలు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. హెలికాప్టర్ కూలిపోవడాన్ని చూసి స్థానికులు సంఘటనా స్థలానికి పరుగెత్తుకొచ్చారు. గాయపడిన వారిని అంబులెన్స్‌లకు తరలించడంలో స్థానికులు కూడా పోలీసులకు, అధికారులకు సహాయం చేసారు.
ముంబయి నుంచి తన సొంత నియోజకవర్గమైన బారామతికి అజిత్ పవార్ ఈరోజు ఉదయమే బయలుదేరారు. అక్కడ ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే విమానం బారామతి రన్‌వేపై ల్యాండ్ కావడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో.. సరిగ్గా 8.45 గంటలకు ఈ ఘోర ప్రమాదం జరిగింది.
కాగా, అజిత్ పవార్ మృతికి ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా విచారం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి అజిత్‌పవార్ మృతికి నివాళిగా మహారాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది. అజిత్ పవార్ మృతి బాధాకరమని, మరియు దురదృష్టకరమని ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పేర్కొన్నారు. విమాన ప్రమాదంపై విచారణకు ఆదేశించామని అన్నారు.


