Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ఖమ్మంలో భారీ సైబర్ స్కాం…మ్యూల్ ఖాతాల ద్వారా 650 కోట్లు విదేశాలకు తరలింపు!

Share It:

హైదరాబాద్: ఖమ్మం పోలీసులు ఒక భారీ సైబర్ మోసాన్ని వెలుగులోకి తెచ్చారు. ఇందులో భాగంగా కంబోడియా, మయన్మార్‌ల నుండి పనిచేస్తున్న అంతర్జాతీయ సైబర్ స్కామ్ నెట్‌వర్క్‌లకు సరఫరా చేసిన మ్యూల్ బ్యాంక్ ఖాతాల ద్వారా దాదాపు రూ. 650 కోట్లను తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఇప్పటివరకు సుమారు 20 మంది నిందితులను అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడు ఉదతనేని వికాస్ చౌదరి పరారీలో ఉన్నాడు. సత్తుపల్లి మండలం తుంబురు గ్రామానికి చెందిన 30 ఏళ్ల నిరుద్యోగి డిసెంబర్ 24న ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.

తనను బలవంతంగా రెండు బ్యాంక్ ఖాతాలు తెరవమని ఒత్తిడి చేశారని, ఆ తర్వాత వాటిని స్వాధీనం చేసుకుని సైబర్ మోసాల కార్యకలాపాలకు ఉపయోగించారని ఫిర్యాదుదారుడు ఆరోపించాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా, వీఎం బంజర పోలీస్ స్టేషన్ పోలీసులు వికాస్ చౌదరితో పాటు పోట్రు ప్రవీణ్, పోట్రు కళ్యాణ్, మోరంపూడి చెన్న కేశవులు, జె శివ కృష్ణ అనే నలుగురిపై కేసు నమోదు చేశారు.

నిరుద్యోగ యువత, రోజువారీ కూలీలే ప్రధాన లక్ష్యం
పోలీసుల దర్యాప్తు ప్రకారం… నిందితులు 2021 నుండి ఖమ్మం జిల్లాలో, ముఖ్యంగా సత్తుపల్లి, దాని పరిసర ప్రాంతాలలో నిరుద్యోగ యువతను, రోజువారీ కూలీలను లక్ష్యంగా చేసుకుని, వారికి రూ. 3,500 నుండి రూ. 10,000 వరకు డబ్బు ఇస్తామని ఆశ చూపి బ్యాంక్ ఖాతాలు తెరిపించారు.

మొత్తంగా సుమారు 110 బ్యాంక్ ఖాతాలు తెరిచి, వాటిని సైబర్ మోసాల ద్వారా వచ్చిన డబ్బును చట్టవిరుద్ధంగా తరలించడానికి మ్యూల్ ఖాతాలుగా ఉపయోగించారని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది.

ఈ ఖాతాలలో మూడు వికాస్ చౌదరి నడుపుతున్న హైదరాబాద్‌కు చెందిన ఒక ఇంటీరియర్ డిజైన్ కంపెనీ పేరు మీద తెరిచారని, మోసంలో ఉపయోగించిన మరో ఖాతాను అతని కుటుంబ సభ్యులలో ఒకరు నిర్వహిస్తున్నారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.

సత్తుపల్లికి చెందిన 31 ఏళ్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన వికాస్, రాజకీయ సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక బంధువు సహాయంతో అరెస్టు నుండి తప్పించుకుంటున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

సైబర్ మోస బాధితుల నుండి దోచుకున్న డబ్బును మొదట మ్యూల్ ఖాతాలలో జమ చేసి, ఆ తర్వాత కంపెనీలు ,వ్యక్తుల పేర్లతో ఉన్న పలు కరెంట్ ఖాతాలకు బదిలీ చేశారని పోలీసులు తెలిపారు.

తదనంతరం, ఈ నిధులను క్రిప్టోకరెన్సీగా మార్చి విదేశాల నుండి పనిచేస్తున్న సైబర్ మోసగాళ్లకు పంపారు. ఈ మోసాల ద్వారా వచ్చిన డబ్బును చట్టవిరుద్ధంగా తరలించినందుకు కమీషన్‌గా నిందితులు రూ. 60 కోట్లకు పైగా జేబులో వేసుకుని ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారని ఆ నివేదికలో పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా, పోలీసులు ఇప్పటివరకు పోట్రు ప్రవీణ్,పోట్రు కళ్యాణ్‌తో సహా 18 నుండి 20 మందిని అరెస్టు చేశారు, ఇంకా పరారీలో ఉన్న మరో ఆరుగురు నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈ కేసులోని మనీలాండరింగ్ కోణం గురించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు సమాచారం అందించినట్లు అది పేర్కొంది. ఈమేరకు వి ఎం బంజర పోలీస్ స్టేషన్‌లో ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ… నిందితులు ఓ వ్యవస్థీకృత సైబర్ క్రైమ్ సిండికేట్‌లో భాగమని చెప్పారు.

“వారు ఉద్యోగ, వ్యాపార అవకాశాల పేరుతో వ్యక్తులను ప్రలోభపెట్టి, సైబర్ మోసాల ద్వారా వచ్చిన డబ్బును స్వీకరించడానికి, బదిలీ చేయడానికి, మనీలాండరింగ్ చేయడానికి వారి పేర్లతో తెరిచిన బ్యాంకు ఖాతాలను ఉద్దేశపూర్వకంగా ఉపయోగించారు. ఆ డబ్బులో కొంత భాగాన్ని క్రిప్టోకరెన్సీగా మార్చారని” ఆయన అన్నారు.

దర్యాప్తు సమయంలో, పోలీసులు పోట్రు మనోజ్ కళ్యాణ్ బ్యాంకు ఖాతాలో రూ. 114.18 కోట్లు, అతని భార్య భానుప్రియకు చెందిన రెండు బ్యాంకు ఖాతాలలో రూ. 45.62 కోట్లు, అతని బావ ఎం సతీష్ ఖాతాలో రూ. 135.48 కోట్లు, నాగాలక్ష్మి ఖాతాలో రూ. 81.72 కోట్లు, కరీంనగర్‌కు చెందిన తటికొండ రాజు ఖాతాలో రూ. 92.54 కోట్లు, వికాస్ చౌదరికి అనుసంధానమై ఉన్న ఒక బ్యాంకు ఖాతాలో రూ. 80.41 కోట్ల లావాదేవీలను గుర్తించారు.

ఆర్థిక లావాదేవీలు, క్రిప్టోకరెన్సీ లావాదేవీలను వివరంగా విశ్లేషించినప్పుడు ఈ అంకెలు ప్రాథమికమైనవని, మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారులు తెలిపారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.