హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా “శాంతి మండలి”, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాబోయే ఇజ్రాయెల్ పర్యటనను ఖండిస్తూ పాలస్తీనా అనుకూల కార్యకర్తలు హైదరాబాద్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా కరపత్రాలు పంపిణీ చేశారు. వీధి చర్చలు నిర్వహించారు. గాజాలో కొనసాగుతున్న హింసను వ్యతిరేకించే ప్రచారాలలో పాల్గొనాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ర్యాలీలో ట్రంప్ శాంతి విధానాలను నిరసిస్తూ కార్యకర్తలు ప్ల కార్డులు ప్రదర్శించారు. ట్రంప్ శాంతి చొరవలకు వ్యతిరేకంగా పాలస్తీనా కార్యకర్తలు బ్యానర్లు, జెండాలను పట్టుకుని నిరసన తెలిపారు.
ఢిల్లీ, ముంబై, పూణే, రోహ్తక్, విశాఖపట్నం, విజయవాడ, పాట్నా, కోల్‌కతా,హైదరాబాద్‌లతో సహా ప్రధాన భారతీయ నగరాల్లో ఇండియన్ పీపుల్ ఇన్ సాలిడారిటీ విత్ పాలస్తీనా (IPSP) దిశా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్, నౌజవాన్ భారత్ సభతో కలిసి ఈ నిరసనలు నిర్వహించాయి.
ట్రంప్ “శాంతి మండలి”లో చేరాలనే భారత ప్రభుత్వ పరిశీలనను నిరసనకారులు ఖండించారు. గాజాలో జరుగుతున్న జాతి వినాశన యుద్ధం మధ్య ప్రధానమంత్రి మోడీ, భారతీయ జనతా పార్టీ (BJP) బెంజమిన్ నెతన్యాహుతో చేతులు కలిపారని ఆరోపించారు.
“ట్రంప్ ప్రతిపాదించిన శాంతి మండలి పాలస్తీనియన్లకు వారి స్వంత భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కును ఇవ్వకుండా గాజాను నియంత్రిస్తుంది, తద్వారా ఇజ్రాయెల్ ఆక్రమణ మరుగున పడుతుంది. ముసాయిదా పత్రంలో గాజా గురించి స్పష్టంగా ప్రస్తావించలేదని IPSP సభ్యురాలు గీత అన్నారు.
జనవరిలో ట్రంప్ “గాజాను పునర్నిర్మించడానికి” ప్రతిపాదించే “శాంతి మండలి” ఏర్పాటును ప్రకటించారు. దీనిని జనవరి 22న దావోస్‌లో ఆవిష్కరించారు. అమెరికా అధ్యక్షుడు దాని ఛైర్మన్‌గా జనవరి 22న దావోస్‌లో అధికారికంగా సంతకం చేశారు. పాకిస్తాన్, భారతదేశంతో సహా అనేక దేశాలు చేరడానికి ఆహ్వానం అందుకున్నాయి.
ప్రస్తుతానికి, భారతదేశం ఇందులో చేరాలా?వద్దా అనే దానిపై తన నిర్ణయాన్ని ఇంకా పరిశీలిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది.
ఈమేరకు నౌజవాన్ భారత్ సభ సభ్యుడు సుహాస్, ప్రధాని మోడీ ప్రతిపాదిత ఇజ్రాయెల్ పర్యటన అవకాశవాద వైఖరిని వెల్లడిస్తుందని పేర్కొన్నారు. “భారత ప్రభుత్వం అధికారికంగా పాలస్తీనా రాజ్య హోదాను ఆమోదిస్తున్నప్పటికీ, అది ఇజ్రాయెల్‌కు దౌత్య, రాజకీయ మద్దతును కొనసాగిస్తోంది. మనం ఇజ్రాయెల్‌తో అన్ని సంబంధాలను తెంచుకోవాలి” అని ఆయన డిమాండ్ చేశారు.
పూణేలో 23 మందిని అదుపులోకి తీసుకున్నారు
మహారాష్ట్రలోని పూణే నగరంలో, ప్రదర్శన ప్రారంభానికి కొన్ని గంటల ముందు పోలీసులు అనుమతి నిరాకరించడంతో 23 మందిని అదుపులోకి తీసుకున్నారు. ట్రంప్ శాంతి విధానాలకు వ్యతిరేకంగా పాలస్తీనా అనుకూల నిరసన సందర్భంగా మహిళలు, పోలీసులు ఘర్షణ పడ్డారు.
ట్రంప్ శాంతి కార్యక్రమాలకు వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శన సందర్భంగా మహిళా నిరసనకారులు, పోలీసు అధికారులు ఘర్షణకు దిగారు.
కాగా, నిర్బంధాన్ని ఖండిస్తూ IPSP ఒక ప్రకటన విడుదల చేసింది, “ఫాసిస్ట్ పాలకులు ఏ విధమైన అసమ్మతి స్వరానికి భయపడుతున్నారో తెలిసింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ఆదేశాలను వ్యతిరేకించే మన ప్రజాస్వామ్య హక్కుపై పూర్తి దాడిని ప్రారంభిస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది అని పేర్కొ్నారు. .”
“బీజేపీ, మోడీ… హంతక నెతన్యాహుకు అండగా నిలుస్తుండగా, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ నకిలీ శాంతి మండలిలో చేరాలని ‘పరిశీలించడం’ వీరికి తప్పుగా అనిపించలేదు… సరికదా, పాలస్తీనా ప్రజలకు న్యాయం, స్వేచ్ఛకు మద్దతు ఇచ్చినందుకు సాధారణ పౌరులు,యువతను దారుణంగా వీధుల్లోకి లాగుతున్నారు” అని ప్రకటనలో పేర్కొంది.
అక్టోబర్ 7, 2023 నుండి, 72వేల మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ చంపేసింది. గాజాలో దాదాపు 90 శాతం మౌలిక సదుపాయాలు పూర్తిగా నాశనమయ్యాయి. పాలస్తీనా పౌర రక్షణ విడుదల చేసిన ఇటీవలి డేటా ప్రకారం, గాజా స్ట్రిప్ అంతటా దాదాపు 8వేల మృతదేహాలు ఇప్పటికీ శిథిలాల కింద ఖననం అయి ఉన్నాయి.

