హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, రాజిరెడ్డి అలియాస్ గంగన్న తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారితో పాటు మరో 16 మంది సభ్యులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు మొగ్గు చూపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి నక్సలిజాన్ని అంతం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ పట్టుదలకు ఈ లొంగుబాటు ఒక పెద్ద విజయంగా కనిపిస్తోంది. కాగా, దేవ్‌జీ దేవ్‌జీ కేంద్ర మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మల్లా రాజిరెడ్డి పొలిట్‌బ్యూరో సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు.
మావోయిస్టు పార్టీ కేడర్, నాయకులు లొంగిపోయి సాధారణ జీవితాన్ని గడపాలని ఒప్పించడానికి తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు తీసుకున్న చర్యల కారణంగా వీరిద్దరూ లొంగిపోయారు. మొత్తంగా జనవరి 2025 నుండి ఇప్పటివరకు 590 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు.
దేశంలో మావోయిస్టు సమస్యను అంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం మార్చి 2026 వరకు గడువు విధించింది. మావోయిస్టుల ఉనికి ఉన్న రాష్ట్రాల్లో వేలాది మంది పోలీసు సిబ్బంది కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.
జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, 1983లోనే అడవి బాట పట్టారు. తన తెలివితేటలతో పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి, దక్షిణ భారత జోన్‌ను శాసించే స్థాయికి చేరుకున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న తిరుపతి, పార్టీ పత్రికలను నడపడంలోనూ, మిలిటరీ వ్యూహాలను రచించడంలోనూ దిట్ట. 2010లో దంతెవాడలో జరిగిన భారీ దాడి వెనుక ఈయనే ఉన్నాడని పోలీసులు భావిస్తున్నారు.

