న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియా సంఘర్షణ ప్రభావంపై జరిగిన రోజువారీ అంతర్-మంత్రిత్వ శాఖల సమావేశంలో, హర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడంలో సహాయపడటానికి యుద్ధనౌకలను పంపమని యూఎస్ భారత్‌ను సంప్రదించిందా అని అడగగా, వాషింగ్టన్ డిమాండ్‌పై ఇరుపక్షాలు ద్వైపాక్షికంగా చర్చించలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
“ఈ ప్రత్యేక విషయంపై పలు దేశాలు చర్చిస్తున్న విషయం మాకు తెలుసు. మేము ఇంకా దీనిపై ద్వైపాక్షికంగా చర్చించలేదు,” అని అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.
హర్ముజ్ జలసంధి గుండా చమురు ట్యాంకర్లు ప్రయాణించడానికి సహాయపడే కూటమిలో పాల్గొనమని తాను సుమారు ఏడు దేశాలను కోరినట్లు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ జలసంధి కేవలం వాషింగ్టన్, ఇజ్రాయెల్,వాటి మిత్రదేశాలకు మాత్రమే మూసివేసామని ఇరాన్ చెబుతోంది.
చైనా, జపాన్, దక్షిణ కొరియాలతో పాటు, బ్రిటన్, ఫ్రాన్స్‌లకు కూడా ఆయన సహాయం కోసం విజ్ఞప్తి చేశారు. అయితే ఆయా దేశాలు ట్రంప్ పిలుపును పట్టించుకోవడానికి పెద్దగా సుముఖత లేదు: బీజింగ్ స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు. “పరిస్థితులు అనుమతించినప్పుడు” నౌకలకు రక్షణగా వెళ్లే విషయంలో పారిస్ ఒక అంగీకారానికి రావచ్చు. వైట్హాల్ ఒక యుద్ధనౌకను పంపే అవకాశం లేదు – జలసంధిని తిరిగి తెరవడానికి యూకే తన మిత్రదేశాలతో కలిసి ఒక ప్రణాళికపై పనిచేస్తోందని, అయితే “మేము యుద్ధంలో మాత్రం పాల్గొనమని ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ అన్నారు.
“ఈ ఏడు దేశాలు వచ్చి తమ సొంత భూభాగాన్ని రక్షించుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను, ఎందుకంటే అది వారి భూభాగం, అక్కడి నుంచే వారికి ఇంధనం లభిస్తుంది… వారు వచ్చి దానిని రక్షించడంలో మాకు సహాయం చేయాలి. బహుశా మనం అక్కడ అసలు ఉండకూడదేమో అని కూడా వాదించవచ్చు, ఎందుకంటే దాని అవసరం మాకు లేదు. మా వద్ద చాలా చమురు ఉంది,” అని హర్ముజ్ జలసంధిని ప్రస్తావిస్తూ ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ విలేకరులతో అన్నారు.
జలసంధిని తెరిచి ఉంచడానికి యుద్ధనౌకలు కావాలన్న ట్రంప్ పిలుపు నేపథ్యంలో, మరోవైపు టెహ్రాన్‌తో ప్రత్యక్ష చర్చల ద్వారా భారతదేశం ఈ వైఖరిని అవలంబిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ మార్గమే తనకు “ఫలితాలను ఇస్తోందని” విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు.
“నేను ప్రస్తుతం వారితో చర్చలు జరుపుతున్నాను.నా చర్చలు కొన్ని ఫలితాలను ఇచ్చాయి. ఇది కొనసాగుతోంది. ఇది నాకు ఫలితాలనిస్తుంటే, నేను సహజంగానే దీనిని కొనసాగిస్తాను,” అని ఈయూ విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరయ్యేందుకు బ్రస్సెల్స్కు వెళ్లిన జైశంకర్ ఫైనాన్షియల్ టైమ్స్‌తో అన్నారు.
స్వదేశంలో ఎల్పిజి సంక్షోభం నెలకొన్నప్పటికీ, భారత జెండాతో కూడిన శివాలిక్,నందా దేవి గ్యాస్ ట్యాంకర్లు హర్ముజ్‌ను దాటేందుకు ఇరాన్ నుండి అనుమతి పొందాయి. కాబట్టి ఇటువంటి దౌత్యం ఎలాంటి ఫలితాలనివ్వగలదనే దానికి ఇదే పెద్ద ఉదాహరణ అని మన విదేశాంగమంత్రి అన్నారు. టెహ్రాన్‌తో ‘సమన్వయం’ చేసుకునే ఈ విధానాన్ని ఐరోపా కూడా అనుసరించవచ్చని ఆయన సూచించారు.
“కాబట్టి, ఈ విధానం ఇతర దేశాలను కూడా ఇందులో పాలుపంచుకునేలా చేస్తే, ప్రపంచానికి మేలు జరుగుతుందని నేను భావిస్తున్నాను.చాలామంది కూడా [టెహ్రాన్‌తో] సంభాషణలు జరిపారని నాకు తెలుసు,” అని ఆయన ఎఫ్‌టితో అన్నారు.
భారత నౌకల కోసం మనం ‘సంపూర్ణ అనుమతి’ని పొందలేదని జైశంకర్ స్పష్టం చేశారు. “ప్రతి నౌక కదలిక ఒక ప్రత్యేకమైన సంఘటన,” అని ఆయన అన్నారు. న్యూఢిల్లీ, టెహ్రాన్ల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఏమీ లేదని కూడా ఆయన ఖండించారు. ఇరుపక్షాల ‘పరస్పర వ్యవహారాల చరిత్ర’ ఆధారంగానే తాను ఈ చర్చలు జరిపినట్లు పత్రికకు తెలిపారు.
భారత జెండా ఉన్న నౌకలకు స్వేచ్ఛా ప్రయాణానికి అనుమతి ఇవ్వడానికి బదులుగా ఇరాన్ ఏమి కోరుకుంటోందని సోమవారం జరిగిన అంతర్-మంత్రిత్వ శాఖల పత్రికా సమావేశంలో ప్రశ్నించగా, విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించింది.
అయితే, ఆ తర్వాత రోజు రాయిటర్స్ నివేదించిన ప్రకారం… టెహ్రాన్ నిజానికి ప్రతిఫలంగా ఏదో కోరుతోంది: అక్రమ నౌకల మధ్య బదిలీలలో పాల్గొన్నాయనే ఆరోపణలపై గత నెలలో భారత అధికారులు స్వాధీనం చేసుకున్న మూడు ట్యాంకర్లను న్యూఢిల్లీ విడుదల చేయాలని కోరింది.
ఇరాన్‌కు మందులు, వైద్య పరికరాలు అందించాలని కూడా టెహ్రాన్ కోరినట్లు ఆ వార్తా సంస్థకు చెందిన సౌరభ్ శర్మ, కృష్ణ దాస్ నివేదించారు.
అలాంటి చర్చలు జరిగాయన్న విషయాన్ని భారత ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. “ఈ నివేదిక నిరాధారమైనది. భారత, ఇరాన్ అధికారుల మధ్య ఈ తరహా చర్చ ఏదీ జరగలేదు. ఏదేమైనా, ఆ మూడు నౌకలు ఇరాన్‌కు చెందినవి కావు,” అని వారు తెలిపారు.
రాయిటర్స్ కథనం ప్రకారం… ఫిబ్రవరి 15న దాఖలు చేసిన ఒక ఫిర్యాదులో నికరాగ్వా జెండా కలిగిన ‘ఆస్ఫాల్ట్ స్టార్’ నౌక హెవీ ఫ్యూయల్ ఆయిల్ స్మగ్లింగ్‌లో పాలుపంచుకుందని భారత కోస్ట్ గార్డ్ ఆరోపించింది. ఆ నూనెను మాలియా జెండా కలిగిన ‘అల్ జఫ్జియా’ నౌకలోకి, బిటుమెన్‌ను ఇరాన్ జెండా కలిగిన ‘స్టెల్లార్ రూబీ’ నౌకలోకి రవాణా చేశారు. ఈ నౌకలు తమ గుర్తింపును, మార్గాలను దాచిపెట్టాయని కూడా ఆరోపణలు ఉన్నాయి.
గత సంవత్సరం ‘అల్ జఫ్జియా’ నౌక ఇరాన్ నుండి జిబూటీకి ఫ్యూయల్ ఆయిల్‌ను రవాణా చేసిందని రాయిటర్స్ గత నెలలో నివేదించింది. ఇరాన్ పెట్రోల్ వాణిజ్యాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా ట్రెజరీ విభాగం ఆంక్షలు విధించిన మూడు నౌకలతో ఈ మూడు నౌకలు ఒకే అంతర్జాతీయ సముద్ర సంస్థ (IMO) నంబర్లు ఉన్నాయని ఆ వార్తా సంస్థ తెలిపింది.
