Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ఫిబ్రవరిలో మైనారిటీలపై ద్వేషపూరిత నేరాలు 60 శాతం పెరిగాయి!

Share It:

హైదరాబాద్: ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా కనీసం 67 ద్వేషపూరిత నేరాలు నమోదయ్యాయి, ఇది జనవరి గణాంకాలతో పోలిస్తే 60 శాతం ఎక్కువ. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 20 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత తెలంగాణలో 14 కేసులు నమోదయ్యాయి. వీటిలో 13 ముస్లింలపై, ఒకటి దళితులపై నమోదయ్యాయి. తెలంగాణలోని ఐదు కేసులు ఒక్క హైదరాబాద్‌లోనే నమోదయ్యాయి.

ఈ నెలలో బహిరంగ సభలలో నిరంతర ద్వేషపూరిత ప్రసంగాలు, అధికారంలో ఉన్న ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ముస్లింలపై కాల్పులు జరుపుతున్నట్లుగా అధికార పార్టీ అధికారిక హ్యాండిల్ ద్వారా ఏఐ (AI) రూపొందించిన వీడియో, దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో కుల ఆధారిత వివక్షకు సంబంధించిన కొత్త ఉదంతాలు కూడా చోటుచేసుకున్నాయి.

అయినప్పటికీ “మహ్మద్ దీపక్ ప్రభావం” లాంటి కొన్ని సంఘటనలు, మతపరమైన దురాక్రమణకు వ్యతిరేకంగా సాధారణ పౌరులు తిరుగుబాటు చేస్తున్నారని సూచించాయి.

జాతీయ దృష్టిని ఆకర్షించిన ముస్లింలపై ద్వేషపూరిత నేరాలను ఇప్పుడు పరికిద్దాం…

సామాజిక బహిష్కరణ
మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో, హిందూ కుటుంబాలు ముస్లింలతో అన్ని వాణిజ్య, వ్యక్తిగత సంబంధాలను తెంచుకోవాలని మహాసభ ఒక తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత, పది ముస్లిం కుటుంబాలు సామాజిక బహిష్కరణకు గురయ్యాయి.

ఉత్తరప్రదేశ్‌లో, ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలపై చేపట్టిన ఎస్‌ఐఆర్‌ నేపథ్యంలో, ధర్మేంద్ర మౌర్య అనే వ్యక్తి ఫారం 7 ద్వారా అభ్యంతరాలు దాఖలు చేసి, జాబితా నుంచి 86 ముస్లిం పేర్లను తొలగించమంటూ కోరారని… బూత్-స్థాయి అధికారి (BLO) ప్రసాద్ యాదవ్ ఆరోపించారు. “జాబితాలోని పేర్లను చూసినప్పుడు, అందులో పేర్కొన్న వ్యక్తులందరూ సజీవంగా, వారి వారి ప్రదేశాలలోనే ఉన్నారని నేను గ్రహించానని” యాదవ్ అన్నారు.

ఫిబ్రవరి నెల ప్రారంభంలో, అస్సాం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారిక ‘X’ హ్యాండిల్ ఒక వివాదాస్పద AI-సృష్టించిన వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో, ఒక వ్యక్తి టోపీ ధరించి ఉండగా, మరొకరికి గడ్డం ఉంది. ముస్లింలపై హింసను ప్రేరేపించేదిగా ఉన్న ఈ వీడియోను తర్వాత తొలగించారు. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ, శర్మపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, శర్మ ఆ వీడియో గురించి తనకు “తెలియదు” అని తేలికగా కొట్టిపారేశారు.

ఫుడ్ జిహాద్, మసీదు విధ్వంసం
తెలంగాణలో, మేడారం జాతర వద్ద ఖోవా బన్ విక్రేత షేక్ షేక్షా వలి బహిరంగంగా అవమానించారు. తేజస్వి న్యూస్‌కు చెందిన యూట్యూబర్లు అతనిపై “ఫుడ్ జిహాద్” ఆరోపణలు చేసి, ఆ బన్‌లలో విషం కలపలేదని “నిరూపించడానికి” కెమెరా ముందు తన సొంత బన్‌లను తినాలని డిమాండ్ చేశారు.

అలాగే ముస్లిం రాజకీయ నాయకులు కూడా వివక్షను ఎదుర్కొన్నారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో, మహా శివరాత్రి సందర్భంగా శివసేన ఎమ్మెల్యే అబ్దుల్ సత్తార్ నాగేశ్వర మహాదేవ్ ఆలయంలో పూజలు చేసిన తర్వాత, హిందుత్వ యువకులు, ఆలయ యాజమాన్యం “శుద్ధీకరణ” ఆచారంగా ఆలయంపై గోమూత్రాన్ని చల్లారు.

ఫిబ్రవరిలో రంజాన్ ప్రారంభం కాగానే, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మత ఘర్షణలు చెలరేగాయి. రంజాన్ మాసం ప్రారంభానికి రెండు రోజుల ముందు, ఫిబ్రవరి 16న, తెలంగాణలోని యాదదిరి భువనగిరి జిల్లాలో ఉన్న జామా మసీదులో నమాజ్‌ చేస్తున్న భక్తులు, తమ మసీదు ధ్వంసం చేయటాన్ని గమనించారు. మసీదు లోపల బీర్, విస్కీ సీసాలు చెల్లాచెదురుగా పడి ఉండటంతో పాటు, ఖురాన్ ప్రతులను అపవిత్రం చేశారు.

నాలుగు రోజుల తర్వాత, కామారెడ్డిలో ముజమిల్ అనే ముస్లిం వ్యక్తి, పని చేసే చోట ఒక సేల్స్‌వుమన్ భక్తి గీతాన్ని ప్లే చేయడాన్ని అభ్యంతరం చెప్పడంతో మత ఘర్షణ చెలరేగింది. ఈ వాగ్వాదం త్వరగా ముస్లింలు, హిందువుల మధ్య రాళ్ల దాడికి దారితీయడంతో పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో మొత్తం 19 మందిని అరెస్టు చేశారు.

విద్వేషపూరిత ప్రసంగాలు, ఇస్లామోఫోబిక్ వాతావరణం
ఢిల్లీలోని విరాట్ హిందూ సమ్మేళనంలో, ఒక హిందుత్వ వక్త ముస్లింలను ఎగతాళి చేస్తూ, “అల్లాహ్‌కు పంక్చర్ వేయడం మాత్రమే తెలుసు” అని అన్నారు. అంతేకాకుండా, “ఏదైనా ముస్లిం ఉగ్రవాద చర్యను ఎదుర్కొనేందుకు ఇంట్లో ఆయుధాలు దాచుకోండి” అని సదస్సులో పాల్గొన్నవారిని కోరారు.

ఢిల్లీలోని నంది నగరిలో, కొందరు వ్యక్తుల గుంపు చేతిలో దెబ్బలు తింటున్న తన టీనేజ్ కుమారుడిని కాపాడే ప్రయత్నంలో మహమ్మద్ ఉమర్దీన్‌ను కాల్చి చంపారు.

మధ్యప్రదేశ్‌లోని సిహోరా పట్టణంలో, హిందూ హారతి, తరావీహ్ ప్రార్థనల సమయంలో లౌడ్‌స్పీకర్ల విషయంలో తలెత్తిన వివాదం హింసాత్మకంగా మారింది. ఒక ముస్లిం బాలుడు ఆలయ అధికారులను శబ్దం తగ్గించమని కోరగా, అతనిపై దాడి జరిగింది. ఆ తర్వాత అరవై మందిని అరెస్టు చేశారు. కాగా, వీరిలో ఎక్కువమంది ముస్లింలే కావడం గమనార్హం.

ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ సమీపంలో, ఢిల్లీ-డెహ్రాడూన్ హైవే పక్కన ఉన్న ఒక గోడపై ఇద్దరు హిందూ రక్షా దళ్ మహిళలు “ముసల్మాన్ కే లియే రోడ్ నహీ హై (ఈ రోడ్డు ముస్లింల కోసం కాదు)” అని రాశారు. నిలదీసినప్పుడు కూడా వారు ఏమాత్రం పశ్చాత్తాపం చూపలేదు, తాము ఎలాంటి తప్పు చేయలేదని వాదించారు.

హిందుత్వ నాయకుడు, స్వయం ప్రకటిత గోరక్షకుడు అయిన దక్ష్ చౌదరి, ఇమ్రాన్ అనే ముస్లిం వ్యక్తిపై దాడి చేస్తూ వీడియోలో పట్టుబడ్డాడు. ఒక మైనర్ హిందూ బాలికతో అతనికి సంబంధం ఉందని, తన గుర్తింపును మనీష్ చౌహాన్‌గా తప్పుగా చెప్పుకుంటున్నాడని అతను ఆరోపించాడు.

ఇక రైట్‌వింగ్‌ నాయకులు, బీజేపీ నాయకులు బహిరంగ సభలలో విద్వేషాన్ని రెచ్చగొట్టడం కొనసాగించారు, వారిలో కొందరు ముస్లింలపై హింసకు బహిరంగంగా పిలుపునిచ్చారు.

మధ్యప్రదేశ్‌లో జరిగిన ఒక హిందూ గర్జన ర్యాలీలో, గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజా సింగ్ మాట్లాడుతూ, “వందేమాతరం” పాడటానికి నిరాకరించిన వారికి తగిన గుణపాఠం నేర్పిస్తామని అన్నారు. ఇంకా ఆయన, “నా బజరంగీలలో ప్రతి ఒక్కరూ 10 మంది బంగ్లాదేశీయుల తలలు నరకగలరు. కానీ నాకు ఒకే ఒక డిమాండ్ ఉంది… ఎలాంటి కేసు ఉండకూడదు, ఎలాంటి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకూడదు” అని అన్నారు.

హైదరాబాద్‌లో ఏఐఎంఐఎం నాయకుడు, ముంబ్రా కార్పొరేటర్ అయిన సహర్ యూనస్ షేక్‌పై అవమానకరమైన భాషను ఉపయోగించినందుకు భారతీయ జనతా యువ మోర్చా నగర అధ్యక్షుడు నితిన్ నంధ్‌కర్‌పై కేసు నమోదు చేయబడింది.

శివాజీ జయంతి వేడుకల సందర్భంగా మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూలపై విద్వేషపూరిత ప్రసంగం చేశారనే ఆరోపణలపై కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసన్‌గౌడ పాటిల్ యత్నాల్‌పై కేసు నమోదు చేశారు. హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకోవడానికి ముస్లింలు “లవ్ జిహాద్”ను ఉపయోగిస్తున్నారని ఆయన ఆ వేడుకల్లో అన్నారు.

దళితులు, క్రైస్తవులపై ద్వేషపూరిత నేరాలు
ఫిబ్రవరి నెలలో దళితులపై జరిగిన 16 ద్వేషపూరిత నేరాలను నమోదు అయ్యాయి. వాటిలో ఐదు ఉత్తర ప్రదేశ్‌కు చెందినవి. యూపీ, గుజరాత్, రాజస్థాన్‌లలో అగ్రవర్ణ బృందాలు దళితుల వివాహాలపై దాడి చేశాయి. మహిళలపై లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి.

మరణానంతరం కూడా కుల వివక్ష నుండి ఉపశమనం లభించలేదు. బీహార్‌లో, 91 ఏళ్ల చామ్కీ దేవి కుటుంబాన్ని శ్మశానవాటికలోకి అనుమతించకపోవడంతో, ఆమె మృతదేహానికి ఒక రోడ్డు కూడలి వద్ద అంత్యక్రియలు నిర్వహించారు.

కేరళలో, 23 ఏళ్ల దళిత మతగురువు పి.ఆర్. విష్ణు, కుల వివక్ష, బెదిరింపులు, కల్పిత ఫిర్యాదులను ఆరోపిస్తూ రాజీనామా చేశారు. సనాతన ధర్మంపై ఉన్న ప్రేమ వల్లే తాను మతగురువు వృత్తి వైపు ఆకర్షితుడయ్యానని ఆయన మీడియాకు చెప్పినప్పటికీ, తనను దొంగగా చిత్రీకరించడానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు.

పంజాబ్‌లో, పంజాబ్ విశ్వవిద్యాలయంలోని తన సహోద్యోగి ఒకరు రెండేళ్లుగా కులతత్వ వ్యాఖ్యలు చేశారని ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్ హర్‌ప్రీత్ సింగ్ ఆరోపించారు.

కర్ణాటక, తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో, అగ్రవర్ణ మహిళలు దళిత పురుషులను వివాహం చేసుకున్న తర్వాత, వారి బంధువులు పరువు హత్యకు ప్రయత్నించారు. రెండు జంటలూ ప్రాణాలతో బయటపడ్డాయి.

బీహార్‌లో, కొందరు విద్యార్థులు ఒక క్యాథలిక్ సన్యాసినిని వేధించారు. వారు ఆ ఘటనను కెమెరాలో చిత్రీకరిస్తూ, ఆమెపై లైంగికంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. తీవ్ర ఆందోళనకు గురైన ఆ సన్యాసిని, తన ముఖం నుండి కెమెరాను దూరంగా నెట్టడానికి ప్రయత్నించారు.

‘మహ్మద్ దీపక్ ప్రభావం’: ద్వేషానికి మరో కోణం
పెరుగుతున్న శత్రుత్వం మరియు ఇస్లామోఫోబియా మధ్య, మత సామరస్యానికి సంబంధించిన కొన్ని సంఘటనలు ప్రత్యేకంగా నిలిచాయి.

వారణాసిలో, ముస్లిం దుకాణదారులను భయపెట్టడానికి హిందుత్వ కార్యకర్తలు చేసిన ప్రయత్నాలను… “ఐడీ చూపించు” అని నినాదాలు చేస్తూ స్థానిక నివాసితులు తరిమివేసి విఫలం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో “ఫుడ్ జిహాద్” ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారి షేక్ షేక్షా వాలికి, అతని బన్స్ కొనడానికి దుకాణానికి వచ్చిన స్థానిక హిందువుల నుండి అపారమైన ప్రజా మద్దతు లభించింది. హైదరాబాద్ ఎంపీ ఒవైసీ, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఇద్దరూ ఈ వేధింపులను ఖండిస్తూ, తెలుగు సమాజంలో విభజనవాద, మతతత్వ ప్రవర్తనకు చోటు లేదని అన్నారు.

లక్నో విశ్వవిద్యాలయంలో, క్యాంపస్‌లోని మొఘల్ కాలం నాటి లాల్ బారాదరి భవనంలో ఉన్న మసీదులోకి ప్రవేశాన్ని యాజమాన్యం మూసివేసిన తరువాత, రంజాన్ మాసంలో నమాజ్ చేయడానికి, ఉపవాసం విరమించడానికి తమ ముస్లిం సహవిద్యార్థులకు సహాయం చేయడానికి హిందూ విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేశారు.

తెలంగాణలోని హనుమకొండ జిల్లాలో, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మధ్యంతర ఉత్తర్వు జారీ చేసిన తర్వాత 30 దళిత కుటుంబాలకు తాగునీటి సరఫరా పునరుద్ధరించారు. కర్ణాటకలోని గడగ్ జిల్లాలో, ఒక దళిత కస్టమర్‌కు సేవలు అందించడానికి ఒక మంగళి నిరాకరించిన కొన్ని వారాల తర్వాత, రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రభుత్వ మంగళి దుకాణం ప్రారంభించారు.

ఫిబ్రవరి నెలలో నమోదైన అఘాయిత్యాలు విపరీతంగా పెరిగినప్పటికీ, దేశంలోని ప్రతి ప్రాంతం విభజనకు లొంగిపోలేదనే విషయాన్ని ఈ సంఘటనలు గుర్తు చేశాయి. మొత్తంగా పిభ్రవరి నెల ఆసాంతం 28 రోజుల్లో అరవై ఏడు ఘటనలు జరిగాయి. అంటే, స్థూలంగా చెప్పాలంటే ప్రతి పది గంటలకు ఒక ద్వేషపూరిత నేరం నమోదవుతోంది. వాస్తవానికి, వీటిలో చాలా ఘటనలు నమోదు కాలేదు… ఎందుకంటే ఎవరూ ఫిర్యాదు చేయలేదు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.