బొగోటా: కొలంబియాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేల్‌పై 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపంలో కనీసం 111 మంది మరణించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ నివేదిక వెల్లడించింది. డజన్ల కొద్దీ భవనాలు కూలిపోయాయి, ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. సహాయక చర్యలను వేగవంతం చేయడానికి ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
భూకంప కేంద్రం బొగోటాకు పశ్చిమాన 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోకో ప్రాంతంలోని శాన్ జోస్ డెల్ పాల్మార్‌లో ఉంది, ఇక్కడ సుమారు 4,800 మంది నివసిస్తున్నారు. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం… ఈ భూకంపం 107 కిలోమీటర్ల లోతులో సంభవించింది. పొరుగున ఉన్న ఈక్వెడార్‌లో కూడా ఈ భూకంప ప్రకంపనలు అనుభవమయ్యాయి.
మృతులలో 18 మంది పెరీరా పట్టణానికి చెందినవారని మేయర్ మౌరిసియో సలాజర్ కారకోల్ రేడియోకు తెలిపారు. పరిస్థితి “భయానకంగా” ఉందని కూడా ఆయన చెప్పారు. స్థానిక మీడియా సంస్థలు షేర్‌చేసిన దృశ్యాలలో పెరీరా, కాలి, క్విబ్డో నగరాల్లో ఇళ్లు, చిన్న భవనాలు కూలిపోవడం కనిపించింది. బొగోటాకు పశ్చిమాన 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనిజాలెస్ నగరంలో, ఒక నియో-గోతిక్ కేథడ్రల్ గోపురాలలో ఒకటి కూలిపోయింది.
మధ్య, పశ్చిమ కొలంబియాలో “టెంబ్లోర్స్” అనే చిన్న భూకంపాలు సర్వసాధారణం అయినప్పటికీ, 6.0 కంటే ఎక్కువ తీవ్రత ఉన్నవి అరుదు. గతంలో అర్మేనియా నగరానికి సమీపంలో సంభవించిన 6.2 తీవ్రత గల భూకంపంలో ఏకంగా 1100 మందికి పైగా మరణించారు.
ఈ విపత్తు తర్వాత, కొలంబియా నూతన అధ్యక్షుడు అబెలార్డో డి లా ఎస్ప్రియెల్లా మాట్లాడుతూ… భూకంపం అనంతరం శాన్ జోస్ డెల్ పాల్మార్‌లో తలెత్తిన అత్యవసర పరిస్థితికి సంబంధించి ప్రభుత్వ ప్రతిస్పందన బాధ్యతలను తాను స్వీకరించినట్లు తెలిపారు. “మీరు ఒంటరిగా లేరు. ప్రభుత్వం ఇక్కడ ఉంది మరియు చర్యలు తీసుకుంటోంది,” అని ఆయన అన్నారు.
ఈ భూకంపంలో ఆరు విమానాశ్రయాలు దెబ్బతిన్నాయని, వాటి కార్యకలాపాలను నిలిపివేశారని పౌర విమానయాన సంస్థ తెలిపింది. పశ్చిమ కొలంబియాలోని ఈ విమానాశ్రయాలు పెరీరా, మనిజాలెస్, క్విబ్డో, అర్మేనియా, కార్టాగో, బ్యూనవెంచురాలకు సేవలు అందిస్తాయని ఆ ఏజెన్సీ Xలో రాసింది.
Xలో భూకంప దృశ్యాలు
Manizales, Colombia. Terremoto. pic.twitter.com/BzKcaWIHm1
— Jupac (@Jupacg) August 10, 2026

