వాషింగ్టన్: ఇరాన్‌పై భారీ యుద్ధానికి అమెరికా సన్నాహాలు ముమ్మరం చేస్తోంది. ఇరాన్‌పై కొత్త దాడులు జరగవచ్చని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన తరుణంలో అమెరికా సుమారు 9,000 మంది అదనపు సైనికులను మధ్యప్రాచ్యానికి పంపుతోంది. మరోవంక అమెరికాలో మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ యుద్ధ వాతావరణం మరింత సంక్లిష్టంగా మారుతోంది.
ఇటీవల ఇజ్రాయెల్‌కు వెళ్తున్న ఒక ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ కెప్టెన్‌పై కత్తితో దాడి చేసి విమానాన్ని కూల్చేయడానికి ప్రయత్నించాడు. ఈ ఘటనలో ఇరాన్ హస్తం ఉందన్న ప్రాథమిక అనుమానాలను ట్రంప్ విలేకరుల సమావేశంలో వ్యక్తం చేశారు. ఈ దాడికి ఇరాన్‌తో సంబంధం ఉన్నట్లు తేలితే, అమెరికా తీవ్రంగా ప్రతీకారం తీర్చుకుంటుందని, ఇరాన్ దానికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా నిందితుడికి తీవ్రవాద భావజాలంతో సంబంధాలు ఉన్నాయని పేర్కొనడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.
సైనిక మోహరింపుల విషయానికొస్తే, సుమారు 7,000 మంది నావికులు, 2,000 మంది మెరైన్లతో పాటు యూఎస్ఎస్ థియోడర్ రూజ్వెల్ట్, యూఎస్ఎస్ మాకిన్ ఐలాండ్ వంటి యుద్ధ నౌకల సమూహాలు మధ్యప్రాచ్యానికి బయలుదేరాయి. అక్టోబర్ చివరి నాటికి ఈ ప్రాంతంలో మూడు విమాన వాహక నౌకలు (క్యారియర్లు) మోహరించే అవకాశం ఉంది. దీనివల్ల మధ్యప్రాచ్యంలో అమెరికా నావికాదళ సిబ్బంది సంఖ్య 20,000కి పైగా పెరుగుతుంది. ఇప్పటికే యూఎస్ఎస్ జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్, యూఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్ తదితర నౌకలు ఆ ప్రాంతంలో పహారా కాస్తున్నాయి.
మరోవైపు, ఇరాన్ ఇటీవల చేసిన కాల్పుల విరమణ ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించారు. కీలకమైన హోర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచుతామన్న ఇరాన్ ఆఫర్ ఏమాత్రం సరిపోదని ఆయన తేల్చిచెప్పారు. నవంబర్ 3 ఎన్నికల తర్వాత ఇరాన్‌పై దాడులు మరింత పెరిగే అవకాశం ఉందని టైమ్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో వెల్లడించిన ట్రంప్, తన భవిష్యత్తు వ్యూహాలను మాత్రం బయటపెట్టబోనని అన్నారు.
ఈ యుద్ధం ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి నష్టం చేకూరుస్తుందా అన్న ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ, “అలా జరిగే అవకాశం ఉంది, కానీ ఇరాన్ చేతికి అణ్వాయుధాలు చిక్కకుండా అడ్డుకోవడం కోసం ఈ చర్యలు కచ్చితంగా సహాయపడతాయి” అని స్పష్టం చేశారు.
మరోవంక ఇరాన్‌తో సుదీర్ఘంగా సాగుతున్న ఘర్షణ ఇప్పటికే అమెరికా సైనిక వ్యవస్థపై ఒత్తిడి పెంచింది. అమెరికా సిబ్బందిలో 800 మందికి పైగా గాయపడగా, కనీసం 19 మంది మరణించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. సైనిక స్థావరాలు, విమానాలు దెబ్బతినడం, భారీ ఆర్థిక వ్యయం, సుదీర్ఘ మోహరింపుల కారణంగా నిర్వహణ, సిబ్బంది సమస్యలు కూడా పెరిగాయి. ఇలాంటి సమయంలో మూడు క్యారియర్లను ఒకే ప్రాంతంలో సిద్ధంగా ఉంచడం అమెరికా హెచ్చరికలకు బలం చేకూరుస్తోంది.
మొత్తంగా అమెరికా భారీ సైనిక మోహరింపు, ట్రంప్ దూకుడు వ్యాఖ్యలు, హార్ముజ్ పరిణామాలు.. మొత్తం మీద మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. అయితే దౌత్య చర్చలు విఫలమైతే, యుద్ధానికి సిద్ధంగా ఉండేలా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నది మాత్రం తాజా పరిణామాల నుంచి స్పష్టమవుతోంది.

