Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ఇరాన్ వార్నింగ్‌…సైనిక స్థావరానికి తరలిన అమెరికా ట్రెజరీ చీఫ్ !

Share It:

వాషింగ్టన్‌: అంతర్జాతీయ రాజకీయాలలో మరోసారి ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఇరాన్ నుంచి వస్తున్న తీవ్రమైన మరణ బెదిరింపుల నేపథ్యంలో.. అమెరికా ట్రెజరీ చీఫ్ స్కాట్ బెస్సెంట్ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి అత్యంత భద్రత కలిగిన రహస్య సైనిక స్థావరానికి తరలివెళ్లారు. ఈ పరిణామం వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య సంబంధాలను మరింత వేడెక్కించింది.

ఈ భద్రతా ఆందోళనల మధ్య ‘CNBC’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్కాట్ బెస్సెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపైనా, తోటి క్యాబినెట్ సభ్యులపైనా వస్తున్న బెదిరింపులే టెహ్రాన్‌పై వాషింగ్టన్ చేపట్టిన ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్” (Operation Economic Outcast) అనే ఆర్థిక ఒత్తిడి ప్రచారం విజయవంతంగా పనిచేస్తోందనడానికి నిదర్శనమని ఆయన తేల్చిచెప్పారు.

“నేను చెప్పేది ఒక్కటే.. ఇరాన్ నాయకత్వం నాశనం కావాలి. నాపైనా, క్యాబినెట్‌లోని ఇతర సభ్యులపైనా వారు మరణ బెదిరింపులు జారీ చేసినంత మాత్రాన మేము భయపడబోము. గల్ఫ్‌లో మన ధైర్యవంతులైన సైనిక సిబ్బంది, స్వయంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరంతరం ప్రాణ ముప్పును ఎదుర్కొంటున్నప్పుడు నేను వెనకడుగు వేసే ప్రసక్తే లేదు” అని బెస్సెంట్ ధైర్యంగా ప్రకటించారు. పెరిగిపోతున్న ఆర్థిక ఒంటరితనం కారణంగా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రస్తుతం మూలన పడిన ప్రమాదకరమైన జంతువులా నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోందని ఆయన వర్ణించారు.

మీడియా బాధ్యతారహిత్యంపై ఆగ్రహం
తాను సైనిక స్థావరానికి మారడాన్ని ధృవీకరిస్తూనే.. ప్రముఖ మీడియా సంస్థ ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్'(WSJ) తీరుపై బెస్సెంట్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన భద్రత దృష్ట్యా జార్జ్‌టౌన్ ప్రాంతంలో తాను కొత్తగా కొనుగోలు చేసిన ఇంటి వివరాలు, జియోలొకేషన్‌ను ప్రచురించవద్దని తన బృందం వేడుకున్నప్పటికీ.. ఆ ఎడిటర్ పెడచెవి పెట్టారని ఆరోపించారు.

” ఆ పత్రిక అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ… నా ఇంటి ప్రదేశాన్ని ఫోటోలతో సహా ప్రచురించింది. సీక్రెట్ సర్వీస్ ఆదేశాల మేరకే నేను ఇల్లు ఖాళీ చేసి సైనిక స్థావరానికి మారాను. ఇలాంటి ప్రమాదకర జర్నలిజం తక్షణమే ఆగిపోవాలి” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ వారం మొదట్లో బెస్సెంట్ నివాసం మార్పుపై WSJ నివేదించిన కథనమే ఈ చర్చకు ప్రధాన కారణం కావడం గమనార్హం.

టెహ్రాన్‌కు ట్రంప్ అల్టిమేటం
ఈ మొత్తం పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. అమెరికా అధికారులను లేదా ట్రెజరీ చీఫ్‌ను కనుక ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటే ఊహించని తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సేలం న్యూస్ ఛానెల్‌తో ఫోన్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రంప్.. టెహ్రాన్‌కు స్పష్టమైన సందేశం పంపారు.

ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ లాంటి అమెరికా అధికారిని ఒకవేళ ఇరాన్ చంపితే వాషింగ్టన్ ప్రతిస్పందన ఏమిటని ప్రశ్నించగా.. ట్రంప్ సంకోచం లేకుండా, “వారు ఇకపై ఉండరు” అని బదులిచ్చారు.

తన పదవీకాలం ముగిసే నాటికి ఇరాన్ ఉన్మాదులు ఇంకా దేశాన్ని పాలిస్తూ ఉంటే అది తన అధ్యక్ష పదవికి ఓటమే అవుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్‌పై భవిష్యత్తులో సైనిక చర్య గురించిన ప్రశ్నకు బదులిస్తూ.. “మన మిత్రదేశాలను, మన నౌకలను భయభ్రాంతులకు గురిచేయకుండా ఇరాన్‌ను అడ్డుకోవడానికి బలాన్ని ఉపయోగించడానికి నాకు ఎలాంటి సంకోచం లేదు” అని తేల్చిచెప్పారు.

పూర్తి నియంత్రణలో గల్ఫ్ ప్రాంతం
ఇరాన్‌తో జరుగుతున్న ఈ ఘర్షణలో అమెరికా సంపూర్ణ పైచేయి సాధించిందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. సంఘర్షణ ప్రారంభం కావడానికి ముందు కంటే ఇప్పుడు వాషింగ్టన్ మరింత ఎక్కువగా చమురును వెలికితీస్తోందని తెలిపారు.

హర్ముజ్ జలసంధి పరంగా గల్ఫ్ ప్రాంతం పూర్తిగా మా నియంత్రణలోనే ఉంది. పరిణామాలు ఎటు దారితీసినా అవసరమైతే మా ప్రతిస్పందనను మరింత తీవ్రతరం చేయడానికి వెనుకాడబోం. బహుశా ఇప్పుడే ఆ పనిచేయవచ్చు అంటూ ట్రంప్ హెచ్చరికల తీవ్రతను మరింత పెంచారు. కాగా, ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో పశ్చిమాసియాలో ఎలాంటి భౌగోళిక-రాజకీయ (Geopolitical) మార్పులకు దారితీస్తాయనేది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.