బెర్లిన్: గాజాపై ఇజ్రాయెల్ సైనిక దాడుల నేపథ్యంలో, జర్మనీకి చెందిన ప్రముఖ డాయిచే బ్యాంక్ (Deutsche Bank) ఇజ్రాయెల్ సైన్యానికి సంబంధించిన కంపెనీలకు భారీగా ఆర్థిక సహాయం మరియు రుణ హామీలు అందించినట్లు అంతర్జాతీయ మీడియా పరిశోధనలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. “ఇన్సైడ్ డాయిచే బ్యాంక్” (Inside Deutsche Bank) పేరిట లీకైన లక్షలాది అంతర్గత పత్రాల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 230 మందికి పైగా జర్నలిస్టుల బృందం ఈ పరిశోధనాత్మక నివేదికను వెల్లడించింది.
ఇజ్రాయెల్ రక్షణ శాఖతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా, ఇజ్రాయెల్ సైన్యం ఉపయోగించే ప్రధాన యుద్ధ ట్యాంక్ ‘మెర్కావా 4’ (Merkava 4) కు గేర్‌బాక్స్‌లను సరఫరా చేసే జర్మన్ రక్షణ తయారీ సంస్థ ‘రెంక్’ (Renk GmbH) కు డాయిచే బ్యాంక్ €11.4 మిలియన్ల ముందస్తు చెల్లింపు గ్యారెంటీని అందించిందని ఈ నివేదిక నిగ్గు తేల్చింది.
అలాగే సివిల్ సొసైటీ సంస్థల నివేదికల ప్రకారం, గాజాపై దాడులకు ఆయుధాలు సరఫరా చేసే బోయింగ్ (Boeing), లాక్‌హీడ్ మార్టిన్ (Lockheed Martin), లియోనార్డో (Leonardo), రేథియాన్ (RTX Corp), జనరల్ డైనమిక్స్ వంటి అంతర్జాతీయ రక్షణ రంగ సంస్థలకు డాయిచే బ్యాంక్ సుమారు €4 బిలియన్ల (రూపాయల్లో దాదాపు ₹35,000 కోట్లకు పైగా) రుణాలు, అండర్‌రైటింగ్ సేవలను అందించింది. ఇందులో బోయింగ్ తయారు చేసిన జిబియు (GBU) స్మాల్ డయామీటర్ బాంబులను గాజాలోని నివాస ప్రాంతాలు, పాఠశాలలపై దాడులకు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
లీకైన అంతర్గత ఈమెయిల్ల ప్రకారం, బ్యాంక్ అధికారులు ఈ ఒప్పందాన్ని అంతర్జాతీయంగా డాయిచే బ్యాంక్ పేరు బయటకు రాకుండా, ఒక ఇజ్రాయెల్ బ్యాంక్ ద్వారా నిర్వహించాలని చూసినట్లు తేలింది.అంతేకాదు వివాదాస్పద ఆయుధాల తయారీ సంస్థలతో నేరుగా సంబంధాలు పెట్టుకోకూడదనే సొంత పాలసీలను దాటవేయడానికి డాయిచే బ్యాంక్ లూప్‌హోల్స్‌ను ఉపయోగించుకుందని నివేదిక పేర్కొంది.
ఈ నేపథ్యంలో గాజాలో జరుగుతున్న దాడులకు నిధులు సమకూరుస్తున్న అంతర్జాతీయ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు చట్టపరమైన బాధ్యతలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐక్యరాజ్యసమితి (UN) మానవ హక్కుల నిపుణులు హెచ్చరించారు.
