గత రెండేళ్లుగా జాతిహింసతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ఒక్కసారిగా రాజకీయ కలకలం రేగింది. ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు నిన్న సాయంత్రం గవర్నర్‌కు తన రాజీనామాను సమర్పించారు.
ఈ క్రమంలో నేటి నుంచి జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలను గవర్నర్ రద్దు చేశారు. కాగా, తన నాయకత్వంపై సొంత పార్టీలోనే ఏర్పడిన అసమ్మతిని చల్లార్చడానికి, సభలో తనపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉండటంతో బీరేన్ తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు.
బిరేన్ సింగ్ నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసారు. ఆయనతో పాటు బిజెపి ఈశాన్య ఇన్‌చార్జ్ సంబిత్ పాత్రా, రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు శారదా దేవి కూడా ఉన్నారు. అంతేకాదు ఢిల్లీలో సీఎంతో పాటు కనీసం 14 మంది బిజెపి ఎమ్మెల్యేలు కూడా అమిత్‌షాను కలిసారని పార్టీ వర్గాలు తెలిపాయి. కొంతమంది నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పిఎఫ్) ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఉన్నారని వర్గాలు తెలిపాయి.
మరోవంక సీఎం బీరేన్‌సింగ్ నాయకత్వ మార్పును సొంత పార్టీలోనే పలువురు ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు. ఈ సమయంలో సభలో నిర్వహించే విశ్వాస పరీక్షకు పార్టీ విప్ జారీ చేసినా చాలామంది ధిక్కరించే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా కేంద్రంతో చర్చించిన తర్వాత బీరేన్ సీఎం పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం.
2023లో మేలో మణిపూర్‌లో మైటీ, కుకీ తెగల మధ్య తీవ్ర హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ అల్లర్లలో 250 మంది మరణించగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన అప్పట్లో దేశాన్ని కుదిపేసింది. అల్లర్లను అదుపు చేయడంలో బీజేపీ ఘోరంగా విఫలమైందనే విమర్శలున్నాయి.
రాష్ట్రంలో జరిగిన హింస సీఎం అనుమతితోనే జరిగిందంటూ ఇటీవల వెలువడిన ఒక ఆడియో క్లిప్ సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీంతో సుప్రీం కోర్టు ఆ ఆడియో క్లిప్‌ను విశ్లేషించి దాని ప్రామాణికతపై ఫోరెన్సిక్ నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించాలని సుప్రీం కోర్టు గత వారం కేంద్రాన్ని ఆదేశించింది.
కాగా, ట్రూత్ ల్యాబ్ సంస్థ వాయిస్ ఇన్ టేపులకు, బిరేన్ సింగ్ వాయిస్‌కు మధ్య 93% సరిపోయిందని ఆ సంస్థ సుప్రీం కోర్టుకు తెలిసింది.
ఈ నేపథ్యంలో గవర్నర్‌కు రాసిన తన రాజీనామా లేఖలో బీరెన్ సింగ్ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. మణిపూర్‌లోని ప్రతి పౌరుడి ప్రయోజనాలను కాపాడటం కోసం సకాలంలో చర్యలు తీసుకోవటంతో పాటుగా అవసరమైన సమయంలో జోక్యం చేసుకుంటూ.. అభివృద్ధి పనులు, వివిధ ప్రాజెక్టులు అమలు చేసినందుకు రాజీనామా లేఖలో కేంద్ర ప్రభుత్వానికి బీరెన్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం, మణిపూర్ ప్రభుత్వానికి ఎల్లప్పడూ ఇలాగే తన మద్దతును కొనసాగించాలని ఆయన కోరారు. అలాగే పలు ప్రాధాన్య అంశాలను ప్రస్తావించారు. “వేల సంవత్సరాల నాగరిక చరిత్ర కలిగిన మణిపూర్ ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవాలని” కోరారు.
“సరిహద్దు చొరబాట్లపై” కఠిన చర్యలు తీసుకోవాలని, “అక్రమ వలసదారులను” బహిష్కరించడానికి ఒక విధానాన్ని రూపొందించాలని, ” మాదకద్రవ్య ఉగ్రవాదంపై పోరాటాన్ని కొనసాగించాలని” కూడా ఆయన అభ్యర్థించారు.
మరోవంక సీఎం రాజీనామా నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు కీషమ్ మేఘచంద్ర మాట్లాడుతూ, “మణిపూర్ ప్రజలు ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. చివరగా, ఈ డిమాండ్ మెయిటీ, కుకి వర్గాల నుండి వచ్చినందున, రెండు వైపులా సంతృప్తి చెందవచ్చని అన్నారు.
ఇదిలా ఉండగా ఆడియో టేపుల కేసులో సుప్రీంకోర్టు విచారణ తర్వాత మణిపూర్ బిజెపిలో తిరుగుబాటు పెరిగింది. కేసులోని తదుపరి విచారణ నాటికి బిరేన్ సింగ్ ఆడియో టేపును ప్రభుత్వ ప్రయోగశాల ద్వారా ధృవీకరించాలని కోరుతూ అడ్వకేట్ జనరల్ తుషార్ మెహతా చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు గత సోమవారం (ఫిబ్రవరి 3) అనుమతి మంజూరు చేసిన కొన్ని గంటల తర్వాత, అధికార బిజెపి మణిపూర్ యూనిట్‌లో తిరుగుబాటు పెరిగింది.
నేటి అసెంబ్లీ సమావేశం సందర్భంగా బిరేన్ సింగ్ ప్రభుత్వంపై బలపరీక్ష కోరేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ తీసుకున్న చర్యకు పార్టీ ఎమ్మెల్యేలు అనేక మంది నిశ్శబ్దంగా మద్దతు ఇస్తారనే భయం బిజెపి జాతీయ నాయకత్వానికి కలిగింది.
ఈ సందర్భంగా ఆడియో టేపులపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన కేసులో పిటిషనర్ అయిన కుకి ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ (కోహుర్) చైర్మన్ హెచ్.ఎస్. బెంజమిన్ ది వైర్ వార్తా సంస్థతో మాట్లాడుతూ, “బిరెన్ సింగ్ రాజీనామాతో సగం యుద్ధం గెలిచినట్లే. మైనారిటీ కుకి-జో కమ్యూనిటీపై ఆయన చేసిన నేరాలకు ఆయనపై విచారణ జరిగే వరకు మేం విశ్రమించం అని అన్నారు.
కుకి-జో కౌన్సిల్ సంస్థ నాయకుడు గింజా వుల్జోంగ్ మాట్లాడుతూ… ఆడియో టేపుల చుట్టూ ఉన్న వివాదం బిరెన్ సింగ్ రాజీనామాలో కీలక పాత్ర పోషించిందని అన్నారు.
కాంగ్రెస్ ఎంపీ, పార్టీ కమ్యూనికేషన్స్ సెక్రటరీ-ఇన్‌చార్జ్ జైరామ్ రమేష్ మాట్లాడుతూ… బిరేన్ సింగ్ రాజీనామా “ ఇప్పటికే ఆలస్యం అయిందని అన్నారు.
సుప్రీంకోర్టులో కేసు, అవిశ్వాస తీర్మానంతో పాటు “పెరుగుతున్న ప్రజా ఒత్తిడి” బిరేన్ సింగ్ రాజీనామాకు దారితీసిందని లోక్‌సభ, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఎక్స్‌లో రాశారు.