వాషింగ్టన్: ఇజ్రాయెల్ మారణహోమంతో శిధిల నగరంగా మారిన గాజాను విలీనం చేసుకొని “మధ్యప్రాచ్య రివేరా”గా మార్చాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనను 64 శాతం అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారని ఇటీవలి సర్వేలో తేలింది.
ఈ సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ శాతం ట్రంప్ ఆలోచనపై మండిపడ్డారు. 47 శాతం మంది ఈ ప్రణాళికను “తీవ్రంగా” వ్యతిరేకిస్తున్నామని, 17 శాతం మంది దీనిని “కొంతవరకు” వ్యతిరేకిస్తున్నామని ప్రోగ్రెసివ్ థింక్ ట్యాంక్ – డేటా ఫర్ ప్రోగ్రెస్ నిర్వహించిన సర్వే వెల్లడించింది.
డెమోక్రటిక్ ఓటర్లలో 85 శాతం మంది ఈ ఆలోచనను వ్యతిరేకించగా, 43 శాతం మంది రిపబ్లికన్లు దీనిని వ్యతిరేకించారు. అయితే 46 శాతం మంది రిపబ్లికన్లు ఈ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చారు.
అమెరికా అంతటా 1,200 మంది ప్రతినిధులతో ఈ సర్వే చేసారు. ట్రంప్ దురాలోచనతో ప్రస్తుతం గాజాలో నివసిస్తున్న దాదాపు 1.8 మిలియన్ల పాలస్తీనియన్లను పొరుగు దేశాలకు బలవంతంగా తరలించడం జరుగుతుందని సర్వే పేర్కొంది.
“గాజాపై అమెరికా నియంత్రణ సాధించి, అక్కడి పాలస్తీనా జనాభాను తరలించడాన్ని మెజారిటీ ఓటర్లు వ్యతిరేకిస్తున్నారు” అని డేటా ఫర్ ప్రోగ్రెస్ తన పరిశోధనలో పేర్కొంది.
ఇజ్రాయెల్ మారణహోమం
పాలస్తీనియన్లను బలవంతంగా తరలించాలనే ట్రంప్ ప్రతిపాదనను… పాలస్తీనియన్లు, అరబ్ దేశాలు, ముస్లిం ప్రపంచం గట్టిగా తిరస్కరించింది. జనవరి 19న గాజాలో అమలులోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం తరువాత ఈ ప్రతిపాదన రావడం గమనార్హం. ఇజ్రాయెల్ 15 నెలల మారణహోమం కారణంగా 48,200 మందికి పైగా మరణించగా, వైమానిక దాడులతో ఆ ప్రాంతం శిథిలావస్థకు చేరింది.
మరోవంక ఇజ్రాయెల్ సంవత్సరాలుగా గాజాపై దిగ్బంధనను కొనసాగిస్తోంది, దీనిని ‘ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ జైలు’గా మార్చింది. ఇజ్రాయెల్ మారణహోమం కారణంగా గాజా మొత్తం జనాభా నిరాశ్రయులయ్యారు. దీని ఫలితంగా ఆహారం, నీరు, మందులు, విద్యుత్ వంటి ప్రాథమిక అవసరాలకు తీవ్ర కొరత ఏర్పడింది.