హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ఫీజులను నియంత్రించడానికి ఒక చట్టబద్ధమైన కమిషన్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ విద్యా కమిషన్ ప్రతిపాదించింది. ముసాయిదా బిల్లుతో పాటు ప్రభుత్వానికి ఈ సిఫార్సు,సమర్పించింది.
విద్యారంగ సమస్యలపై 2024 జులైలో ప్రభుత్వం మంత్రులు దుద్దిళ్ల శ్రీధరబాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్ మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిన విషయం తెలిసిందే. ఎలాంటి కీలక నిర్ణయమైనా అందులో చర్చించిన తర్వాతే తీసుకుంటారు. ఫీజుల నియంత్రణపైనా కమిటీ చర్చిస్తుంది” అని పాఠశాల విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు. మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు 2017లో తెచ్చిన ఫీజుల నియంత్రణ చట్టాలను, గత జీవోలు, కోర్టు కేసులు తదితర అంశాలను విద్యాశాఖ సీనియర్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
కాగా, తెలంగాణ విద్యా కమిషన్కు విద్యా ప్రమాణాలను పరిరక్షించడం, ఫీజుల నియంత్రణ, ఉపాధ్యాయుల సామర్థ్యాలను పెంపొందించడం, పాఠశాలల పర్యవేక్షణ, తనిఖీలు, ప్రైవేటు పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం అమలు చేయడం లాంటి అధికారాలు ఉంటాయి. ప్రతిపాదిత కమిషన్కు మద్దతు ఇవ్వడానికి చట్టం చేయాల్సిన అవసరాన్ని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నొక్కి చెప్పారు.
“ఒక చట్టం రూపొందించాలి, లేకుంటే కోర్టులు దానిని అంగీకరించవు” అని ఆయన పేర్కొన్నారు. ఈ సూచనల ఆధారంగా ఏర్పాటు కాబోయే కమిషన్కు ఛైర్మన్గా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అధికారిగా ఉంటారు. సంబంధిత రంగాల నుండి నలుగురు లేదా ఐదుగురు సభ్యులు ఉంటారు. కలెక్టర్ల అధ్యక్షతన జిల్లా ఫీజుల నియంత్రణకు కమిటీలు ఏర్పాటు చేసి వారే ఫీజులను నిర్ణయిస్తారు. ప్రతి సంవత్సరం వినియోగదారుల ధరల సూచిక(సీపీఐ) ఆధారంగా ఫీజులను పెంచుకునేలా తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి ముసాయిదా బిల్లులో సిఫారసు చేసింది.
అంతేకాదు మౌలిక సదుపాయాలు, బోధనలో నాణ్యత వంటి అంశాల ఆధారంగా పాఠశాలలను వర్గీకరించాలని విద్యా కమిషన్ ప్రతిపాదించింది. తల్లిదండ్రులకు ఆర్థిక స్థోమత, విద్యా ప్రమాణాలను నిర్వహించడం మధ్య సమతుల్యతను సాధించడానికి ప్రతి వర్గానికి గరిష్ట ఫీజు పరిమితిని నిర్ణయించనున్నారు. “ఫీజు నిర్మాణం సహేతుకమైన పరిమితులను మించకూడదు . వినియోగదారుల ధరల సూచికకు అనుగుణంగా ఉండాలి” అని మురళి వివరించారు.
తెలంగాణ విద్యా కమిషన్ ఫార్సులు అమలయితే, ప్రైవేట్ పాఠశాల ఫీజు నియంత్రణలో గణనీయమైన మార్పులు తీసుకువస్తాయని, అధిక ఫీజులపై ఉన్న ఆందోళనలను పరిష్కరిస్తాయని,నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా చూస్తుందని భావిస్తున్నారు.